ఒక్క నిద్ర ఆమె జీవితాన్ని మార్చేసింది.. ఉద్యోగం పోయి.. రూ. 850 కోట్ల పరిహారం!
ఒక టీమ్ బిల్డింగ్ ట్రిప్‌లో జరిగిన చిన్న ఘటన ఓ మహిళా టెక్ ఎగ్జిక్యూటివ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఉద్యోగం పోయింది..కెరీర్ దెబ్బతింది..ఈ వ్యవహారం బ్రిటన్‌లోని ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌కు చేరింది. ఇక ఈ కేసులో ఆమె కోరుతున్న పరిహారం ఎంతో తెలుసా? ఏకంగా 76 మిలియన్ పౌండ్లు! భారత కరెన్సీలో ఇది సుమారు రూ.850 కోట్లకు పైమాటే. బ్రిటన్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ చరిత్రలో ఇంత భారీ పరిహారం కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది.

షానన్ బర్న్స్ ఏఐ రంగంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసారు. గతంలో Slack, Lyft వంటి సిలికాన్ వ్యాలీ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఆమె సొంతం. 2022లో ఆమెను Gitpod సంస్థ కీలక పదవిలో నియమించింది. ఆమెకు ఏడాదికి సుమారు 2.2 లక్షల పౌండ్ల జీతం, అదనంగా బోనస్ కూడా ఇచ్చింది. అయితే 2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలో జరిగిన కంపెనీ టీమ్ బిల్డింగ్ కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు ఉద్యోగులు మద్యం సేవించినట్లు ట్రిబ్యునల్‌లో వెల్లడైంది. షానన్ కూడా మద్యం సేవించారు. రాత్రి తన హోటల్ గది తాళం చెవి అందుబాటులో లేకపోవడంతో ఆమె గదిలోకి వెళ్లలేకపోయారు. చివరకు..హోటల్‌లోని సౌనా (ఆవిరి స్నాన గది) లో నిద్రపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఆ ఘటనతో ఉద్యోగానికి ఎండ్ కార్డ్
ఈ ఘటనపై కంపెనీ CEO ఆందోళన వ్యక్తం చేసినట్లు ట్రిబ్యునల్‌లో వెల్లడైంది. ముఖ్యంగా ఆమె వృత్తిపరమైన బాధ్యతల విషయంలో సమస్య ఉందని భావించినట్లు సమాచారం. కొద్ది వారాలకే.. అంటే 2023 జూన్‌లో షానన్ ఉద్యోగం కోల్పోయారు. అయితే ఆమె వాదన మాత్రం వేరుగా ఉంది. తనకు ADHD ఉందని, దాని కారణంగా వస్తువులు మర్చిపోవడం, వాటిని పోగొట్టుకోవడం వంటి సమస్యలు ఉంటాయని ఆమె ట్రిబ్యునల్‌కు తెలిపారు. అదే సమయంలో టీమ్ ట్రిప్‌లో తనతో పాటు మగ ఉద్యోగులు కూడా మద్యం సేవించినప్పటికీ..తనపై మాత్రమే చర్య తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
కోర్టులో కీలక మలుపు
షానన్ తన ఉద్యోగం కోల్పోవడానికి తన వైకల్యమే కారణమని వాదిస్తూ న్యాయపోరాటం ప్రారంభించారు. గత ఏడాది ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హామ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్.. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను వైకల్యం ఆధారంగా వివక్షకు గురి చేసి ఉద్యోగం నుంచి తొలగించినట్లు నిర్ధారించింది. అక్కడితో కథ ముగియలేదు. ఇప్పుడు అసలు సంచలనం మొదలైంది.
రూ.850 కోట్ల పరిహారం ఎందుకు?
ఉద్యోగం పోవడం వల్ల తనకు భారీ ఆదాయ నష్టం జరిగిందని షానన్ చెబుతున్నారు. టెక్ రంగంలో తన కెరీర్ కొనసాగి ఉంటే భవిష్యత్తులో సంపాదించే అవకాశం ఉన్న మొత్తాన్ని లెక్కలోకి తీసుకుని.. మొత్తం 76,071,992 పౌండ్ల పరిహారం కోరుతున్నారు. ఇందులో భవిష్యత్ ఆదాయ నష్టమే సుమారు 59 మిలియన్ పౌండ్లుగా పేర్కొన్నారు. మిగిలిన మొత్తంలో మానసిక వేదన, ఇతర నష్టాలకు సంబంధించిన క్లెయిమ్‌లు ఉన్నాయి.
ఒక మిలియన్ పౌండ్లకు పరిమితం చేయాలని కోరిన కంపెనీ
షానన్ ఇంత భారీ మొత్తాన్ని కోరడాన్ని Gitpod తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమె పరిహారం క్లెయిమ్‌ను ఒక మిలియన్ పౌండ్లకు పరిమితం చేయాలని కంపెనీ ట్రిబ్యునల్‌ను కోరింది. అయితే ట్రిబ్యునల్ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇంత భారీ పరిహారం సాధారణంగా బ్రిటన్‌లో చాలా అరుదని ట్రిబ్యునల్ పేర్కొంది. అమెరికాలో ఇలాంటి భారీ పరిహారాలు ఎక్కువని కూడా వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుతం షానన్ కోరుతున్న మొత్తం తప్పకుండా లభిస్తుందని ట్రిబ్యునల్ చెప్పలేదు. ఈ మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌ను ఈ దశలోనే తిరస్కరించేంత ఆధారాలు లేవని మాత్రమే తెలిపింది.
కంపెనీ విలువ కూడా కీలకమే!
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఉంది. Gitpod ఇటీవల OpenAI యాజమాన్యంలోకి వెళ్లింది.ఈ విక్రయానికి సంబంధించిన విలువను కూడా వెల్లడించాలని ట్రిబ్యునల్ కంపెనీని ఆదేశించింది. షానన్‌కు కంపెనీలో ఉన్న షేర్ల విలువ ప్రస్తుతం సుమారు 2.6 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్లు సమాచారం. కొన్ని లెక్కల ప్రకారం అవి భవిష్యత్తులో 21 మిలియన్ పౌండ్లకు పెరిగే అవకాశం ఉంది.
రికార్డు స్థాయి పరిహారం దక్కుతుందా?
బ్రిటన్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ చరిత్రలో ఇప్పటివరకు తెలిసిన అత్యధిక పరిహారం సుమారు 4.58 మిలియన్ పౌండ్లు. అలాంటి సమయంలో షానన్ కోరుతున్న మొత్తం 76 మిలియన్ పౌండ్లకు పైగా ఉండటం ఇప్పుడు ఈ కేసును మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే ఆమెకు చివరకు అంత మొత్తం లభిస్తుందా? లేదా ట్రిబ్యునల్ పరిహారాన్ని భారీగా తగ్గిస్తుందా అనేది తుది పరిహారం విచారణలో తేలాల్సి ఉంది. Gitpod ఇప్పటికే గత తీర్పుపై అప్పీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ కేసులో ఇంకా న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఒక రాత్రి సౌనాలో నిద్రపోవాల్సి వచ్చిన ఘటనతో మొదలైన వివాదం.. ఇప్పుడు వందల కోట్ల పౌండ్ల పరిహారం క్లెయిమ్‌గా మారింది. చివరకు ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి