Watch: 18 ఏళ్ల ప్రయాణానికి సెలవు.. బస్సు స్టీరింగ్‌కు ముద్దు పెట్టి సెల్యూట్ చేసిన డ్రైవర్!

కేరళ KSRTC డ్రైవర్ పాల్ కురియన్ 18 ఏళ్ల ప్రమాద రహిత ప్రయాణం తర్వాత తన బస్సుకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. పదవీ విరమణ రోజున స్టీరింగ్‌ను ముద్దాడి, సెల్యూట్ చేసిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం, బస్సుతో ఏర్పడిన అనుబంధం పలువురిని ఆకట్టుకుంది. మళ్లీ డ్రైవర్‌గా సేవలందించే అవకాశం వస్తే వస్తానని కురియన్ తెలిపారు.

Watch: 18 ఏళ్ల ప్రయాణానికి సెలవు.. బస్సు స్టీరింగ్‌కు ముద్దు పెట్టి సెల్యూట్ చేసిన డ్రైవర్!
Ksrtc Driver Farewell

Updated on: Sep 04, 2026 | 9:54 AM

కేరళ: ఉద్యోగ జీవితంలో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఓ బస్సు డ్రైవర్.. పదవీ విరమణకు ముందు తన చివరి ట్రిప్‌ను పూర్తి చేసి, తాను నడిపిన బస్సుకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. స్టీరింగ్‌ను ముద్దాడి.. బస్సుకు సెల్యూట్ చేసి వెళ్లిపోయిన ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇడుక్కి జిల్లాలోని KSRTC కుమిలి డిపోకు చెందిన డ్రైవర్ పాల్ కురియన్ సెప్టెంబర్ 2న తన చివరి రోజు ఉద్యోగ బాధ్యతలు పూర్తి చేశారు. షిఫ్ట్ ముగిసిన అనంతరం బస్సును డిపోలో పార్క్ చేశారు. ఆ తర్వాత డ్రైవర్ సీటు వద్దకు వెళ్లి స్టీరింగ్ వీల్‌ను ఆప్యాయంగా ముద్దాడారు. అనంతరం బస్సుకు సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను కేఎస్ఆర్టీసీ అధికారులు వీడియోగా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందింది. బస్సును కేవలం ఒక వాహనంగా కాకుండా.. తన ఉద్యోగ జీవితంలో భాగంగా భావించిన డ్రైవర్‌కు సంబంధించిన ఈ వీడ్కోలు క్షణం పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.

18 ఏళ్లుగా ప్రమాద రహిత సేవ

పాల్ కురియన్ 18 ఏళ్ల పాటు కుమిలి, కట్టప్పన డిపోల్లో KSRTC డ్రైవర్‌గా పనిచేశారు. ముఖ్యంగా తన మొత్తం సర్వీస్‌లో ప్రమాద రహిత డ్రైవింగ్ రికార్డును కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా తమిళనాడులోని కంబం–కొట్టాయం మధ్య అంతర్రాష్ట్ర సర్వీసును ఆయన నడిపారు. ఈ క్రమంలో బస్సుతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని కురియన్ తెలిపారు. “నా అధికారిక పదవీ విరమణ అక్టోబర్ 31న ఉంది. అయితే సెప్టెంబర్ 2 నా చివరి శారీరక విధి. ఇన్నేళ్లుగా నన్ను, నా ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లిన ఈ బస్సుకు చివరి రోజు వందనం చేయాలని అనిపించింది” అని ఆయన పేర్కొన్నారు.

మళ్లీ యూనిఫాంలోకి వస్తారా?

తాను చేసే పనిని ఆస్వాదించినందువల్ల ఉద్యోగం ఎప్పుడూ భారంగా అనిపించలేదని కురియన్ చెప్పారు. పదవీ విరమణ అనంతరం ఎంప్యానెల్డ్ డ్రైవర్‌గా పనిచేసే అవకాశం వస్తే, మళ్లీ సంతోషంగా యూనిఫాం ధరించి బస్సు నడుపుతానని తెలిపారు. ఒక డ్రైవర్‌ తన వాహనానికి ఇచ్చిన ఈ ఆత్మీయ వీడ్కోలు.. ఉద్యోగం, ప్రయాణికులు, వాహనం మధ్య ఏర్పడే అనుబంధానికి చక్కటి ఉదాహరణగా నిలిచింది. 18 ఏళ్ల సేవకు సెల్యూట్ చేస్తూ.. చివరి ట్రిప్‌లో బస్సుకు చెప్పిన వీడ్కోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను తాకుతోంది.

వైరల్ వీడియోను ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us