భారతీయ నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు. రద్దీ సమయంలో వాహనం తీసుకుని బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్ల మీద ప్రయాణిస్తన్నప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనం నడపాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ వాహనం దూసుకొచ్చి డ్యాష్ ఇస్తుందో తెలువదు. ఇక బస్సులు, లారీలు వంటి పెద్ద వాహనాల పక్క నుంచి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. చిన్న వాహనానికి పెద్దవాహనం తాకినా, పెద్ద వాహనానికి చిన్న వాహనం తాకినా డ్యామేజ్ అయ్యేది మాత్రం చిన్న వాహనమే. ఇలాంటి టైమ్‌లోనే వాహనదారులు రోడ్ల మీద గొడవలు పడుతుండటం చూస్తుంటాం.
వాహనాలు ఒకదానినొకటి తాకుతూ వెళ్లినప్పుడు, ట్రాఫిక్ లో అడ్డంగా ఉన్నప్పుడు వివాదం మొదలవుతుంది. వాహనాల మీద నుంచి కిందకు దిగి రోడ్డుమీదే గల్లాలు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బైకర్ చేసిన పనికి బస్సు డ్రైవర్ తీవ్ర ఆగ్రహం చెందాడు. దీంతో డ్రైవర్ చేసిన పనితో అక్కడున్న వారంతా పరేషాన్ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక బైకర్ రోడ్డు మీద ఆగి ఉన్న బస్సు తలుపు తెరిచి డ్రైవర్‌తో గొడవకు దిగాడు. ఇద్దరూ మాటా మాటా అనుకున్నారు. డ్రైవర్ చేయి పట్టుకుని దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఆ బస్సు డ్రైవర్ తన చేతిని విడిపించుని సీటు నుంచి పైకి లేచాడు. సీటు వెనుక తగిలించిన తన బ్యాగ్, బైక్ హెల్మెట్ తీసుకొని బస్సు నుంచి కిందకు దిగాడు. ఆ తర్వాత బస్సును రోడ్డుపై వదిలేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనలో అక్కడున్న వాహనదారులంతా షాకయ్యారు.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను కామెంట్ల రూపంలో పోస్టు చేశారు. అతడికి గొడవలు ఇష్టం ఉండవేమో, చాలా ప్రశాంతమైన వ్యక్తి అని ఒకరు కామెంట్ చేశారు. ఆ డ్రైవర్ మంచి పని చేశాడు అంటూ మరికొంత మంది నెటిజన్స్ పోస్టులు పెట్టారు.
Life is too short to do Kalesh, Just Pack your bag and Move on pic.twitter.com/cvkubSDbDy
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 18, 2025