తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గడ్డం వివాదంతో వివాహం ఆగిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే కోయంబత్తూరు నగరం పరిధిలోని సూలూరు ప్రాంతానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కొడుకుకు సంబంధించిన వివాహ ఏర్పాట్లు చేశాడు. మూడు నెలల క్రితమే పొల్లాచ్చి అనే ప్రాంతానికి చెందిన యువతితో తన కొడుకుకి నిశ్చితార్థం జరిగింది. ఇరు వర్గాల పెద్దలు మూడు నెలలుగా పెళ్లి హడావిడి పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే తనకు కాబోయే భార్యతో ఆ పారిశ్రామికవేత్త కొడుకు కూడా నిత్యం ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ బీజీ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రతిరోజూ గడ్డంతోనే కనిపించే వాడు.
అయితే పెళ్లి సమయానికి మాత్రం గడ్డం తీసి వేసి నీట్‌గా షేవింగ్ చేసుకోవాలని తన తండ్రి సూచనలు చేస్తూ వచ్చాడు. ఇక పెళ్లి గడియల సమయం రానేవచ్చింది. సోమవారం రోజున వివాహం బ్రహ్మాండంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు. దీంతో ఆదివారం రోజున తండ్రి సూచన మేరకు బ్యూటీ ఫార్లర్‌కు వెళ్లి తన గడ్డం తొలగించి నీట్‌గా షేవింగ్ చేసుకుందామని ఆ వరుడు వెళ్లాడు. అయితే బ్యూటీ ఫార్లర్‌లో ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. గడ్డంను ట్రిమ్ చేసుకుని ఇంటికి వచ్చిన తనయుడిని చూసిన తన తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. షేవింగ్ ఎందుకు చేసుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అయితే తనకు కాబోయే భర్త గడ్డంతోనే ఉండి పెళ్లి పీటలు ఎక్కాలని, కొద్దిగా ట్రీమ్ చేసుకుంటే చాలని తనకి కాబోయే భార్య సూచించినట్లు తండ్రికి.. ఆ వరుడు బదులు చెప్పాడు.
దీంతో తండ్రి మరింత మండిపోయాడు. ఇప్పుడే నాకు గౌరవం ఇవ్వడం మానేశావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు గడ్డం తీసుకుంటేనే పెళ్లి అని తేల్చి చెప్పాడు. దీంతో ఎవరి మాటలు వినాలో తెలియక అయోమయానికి గురయ్యాడు. చివరకు తన తండ్రిని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. అయితే,తండ్రి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇక తన సోషల్ మీడియాలో సోమవారం జరగాల్సిన తన కుమారుడి వివాహం ఆగిందని, ఎవ్వరూ రావాల్సిన అవసరం లేదని చెప్పేశాడు. ఇది వధువు కుటుంబం దృష్టికి చేరడంతో పెళ్లికొడుకు ఇంటికి వారు వెళ్లారు. తాను చెప్పినట్టుగా గడ్డం తొలగించకుండా వధువు చెప్పినట్టుగా ట్రిమ్ చేసుకొచ్చిన కొడుకు పరిస్థితిని వారికి వివరించాడు. అయితే బంధువులు, వధువు కుటుంబ సభ్యులు ఎంత బుజ్జగించినా కూడా ఆ తండ్రి ఏమాత్రం తగ్గలేకపోయాడు. దీంతో ఉదయం జరగాల్సిన వివాహం అర్థాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా తన కంపెనీలోని కార్మికులే గడ్డం పెంచితే తాను ఒప్పుకోనని.. అలాంటిది కొడుకే ఈ నియమాన్ని పాటించకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తండ్రి చెప్పడం చూసి అవాక్కయ్యారు. అయితే ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.