ఏలియన్లు భూమ్మీదకు వచ్చారా? ఎగిరే పళ్లెం ఆకారంలో ఇల్లు.. ధర రూ.12 కోట్లకు పైనే!
ఇల్లు అంటే నాలుగు గోడలు, పైకప్పు, గదులు ఉంటే చాలు అనుకుంటాం. కానీ ఎగిరే పళ్లెం (UFO) ఆకారంలో ఉండే ఇంటిని ఎప్పుడైనా చూశారా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే విచిత్రమైన ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అమెరికాలో ఉన్న ఈ ప్రత్యేకమైన ఇంటిని ఏకంగా 1.5 మిలియన్ డాలర్లకు (రూ.12.5 కోట్లు) అమ్మకానికి పెట్టారు. దీని ఆకారం మాత్రమే కాదు.. దీని వెనుక చరిత్ర కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది.

ఈ ఇంటి పేరు డొనాల్డ్‌సన్ ఫ్యూచరో. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జసింటో పర్వత ప్రాంతాల్లో ఉంది. 1969లోనే నిర్మించిన ఈ భవిష్యత్ ఇంటి విస్తీర్ణం కేవలం 793 చదరపు అడుగులు మాత్రమే. అయినప్పటికీ, దీని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఫిన్‌లాండ్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మాటి సూరోనెన్ ఈ ఫ్యూచరో ఇంటిని రూపొందించారు. అంతరిక్ష పరిశోధన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న సమయంలో.. సంప్రదాయ ఇళ్లకు భిన్నంగా ఉండేలా వీటిని డిజైన్ చేశారు. ఈ ఇంటి నిర్మాణానికి ఫైబర్‌గ్లాస్, పాలిస్టర్ ప్లాస్టిక్ వాడారు. దీని బరువు దాదాపు 5.4 టన్నులు.
హెలికాప్టర్ ద్వారా తరలింపుకు తగ్గట్టుగా నిర్మాణం!
ఫ్యూచరో ఇళ్ల రూపకల్పన వెనుక మరో ఆసక్తికరమైన ఆలోచన ఉంది. వీటిని ముందుగానే తయారు చేసి, అవసరమైన ప్రదేశానికి తరలించి అమర్చుకోవచ్చు. అంతేకాదు.. హెలికాప్టర్ సాయంతో కూడా తరలించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ డిజైన్‌ను రూపొందించారు. అయితే, ప్రస్తుతం అమ్మకానికి ఉన్న ఈ ఇంటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం అంత సులభం కాలేదు. మొదట ఇది శాన్ డియాగోలో ఉండేది. కొన్నేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన ఈ నిర్మాణం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కాపాడేందుకు ముందుకొచ్చిన ఆర్కిటెక్ట్ డొనాల్డ్‌సన్.. 2004లో ఈ ఇంటిని ఐడిల్‌వైల్డ్ ప్రాంతానికి తరలించారు. పర్వత ప్రాంతాల్లోని రహదారుల మీదుగా భారీ ట్రక్కుపై తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంటి పరిమాణం, కొన్ని ప్రాంతాల్లో రహదారులపై పరిమిత స్థలం కారణంగా ఈ తరలింపు సవాలుగా మారింది.
లోపలికి వెళ్తే 1960ల కాలంలోకి వెళ్లినట్టే!
ఈ ఇంటి బయట రూపం ఎంత భిన్నంగా ఉంటుందో.. లోపలి అలంకరణ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. 1960ల నాటి శైలిని ప్రతిబింబించే ప్రకాశవంతమైన రంగులు, లామినేట్ ఉపరితలాలు, మెత్తటి కార్పెట్‌లు ఇందులో కనిపిస్తాయి. ఇంటిని పునరుద్ధరించే సమయంలోనూ దాని అసలు రూపాన్ని సాధ్యమైనంత వరకు కాపాడారు. ఇందులోని కొన్ని ఫర్నిచర్‌లు, కౌంటర్ టాప్‌లు వంటి పాతకాలపు ప్రత్యేకతలను అలాగే ఉంచారు. అయితే, ఆధునిక భవన నిర్మాణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసారు. ఆ ప్రక్రియలో ఇంటి అసాధారణ ఆకృతికి పెద్దగా నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రపంచంలో మిగిలింది 50 నుంచి 60 ఇళ్లే!
ఫ్యూచరో డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 నిర్మాణాలు తయారైనట్లు అంచనా. వాటిలో ప్రస్తుతం 50 నుంచి 60 వరకు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందువల్ల ఈ ఇల్లు కేవలం నివాసం మాత్రమే కాదు.. ఒక అరుదైన నిర్మాణ కళాఖండంగా కూడా గుర్తింపు పొందింది. ఈ ఇంటికి అమెరికా చారిత్రక ప్రదేశాల జాతీయ రిజిస్టర్‌లో స్థానం లభించింది. కాలిఫోర్నియా చారిత్రక ల్యాండ్‌మార్క్‌గా కూడా గుర్తింపు పొందింది. అంతేకాదు, కాలిఫోర్నియాలో నివాస అవసరాల కోసం అధికారికంగా అనుమతి పొందిన తొలి ఫ్యూచరో ఇల్లుగా ఇది గుర్తింపు పొందింది. ఇంటి పునరుద్ధరణకు కాలిఫోర్నియా ప్రిజర్వేషన్ ఫౌండేషన్ నుంచి గుర్తింపు లభించింది. అంటే, దీని విలువ కేవలం వింత ఆకృతిలోనే కాకుండా.. అరుదైన నిర్మాణ వారసత్వాన్ని కాపాడటంలోనూ ఉంది.
ఎందుకు అమ్మకానికి పెట్టారు?
ఈ ఇంటిని పునరుద్ధరించి కాపాడిన డొనాల్డ్‌సన్, ఆయన భార్య ఇప్పటివరకు దీనితో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, డొనాల్డ్‌సన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుండటంతో ఈ ఇంటిని విక్రయించాలని నిర్ణయించారు. తమ తర్వాత ఈ ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తి కూడా దీని ప్రత్యేకతను గుర్తించి, ఇప్పటివరకు చేసిన పునరుద్ధరణ పనులను కాపాడాలని వారు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటి ధర 1.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.12.5 కోట్లకు పైగా ఉంటుంది. ఎగిరే పళ్లెంలా కనిపించే ఈ ఇల్లు ఒక వింత నిర్మాణం మాత్రమే కాదు. 1960లలో భవిష్యత్తు జీవనశైలిపై ఆర్కిటెక్ట్‌లు కన్న కలలకు ప్రతిరూపం. దశాబ్దాలు గడిచినా తన ప్రత్యేకతను నిలుపుకున్న ఈ ఇల్లు ఇప్పుడు కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది.