పాము పగ అంటే ఇలా ఉంటదా.. 70 ఏళ్ల వృద్ధుడిని 14 సార్లు కాటేసిన ఒకే పాము.. ట్విస్ట్ ఏంటంటే..?
పాము పగ.. దీనిపై ఎంతోకాలంగా చర్చోపచర్చలు నడుస్తూనే ఉన్నాయి. పాము పగబడుతుందని జనాలు అంటుంటే.. అలాంటిదేమి ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాము పగకు సాక్ష్యంగా నిలిచే ఘటన యూపీలో జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి ఒకే పాము 14 సార్లు కరిచింది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాము పగ గురించి తరుచూ వింటూనే ఉంటాం. పాము పగబట్టిందంటే ప్రాణాలు తీసేదాక వదలదు అని అంటారు. శాస్త్రవేత్తలు మాత్రం పాము పగపట్టడం అనేది ఉండదని అంటున్నారు. ఈ క్రమంలో పాము పగకు సాక్ష్యంగా నిలిచే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది. పట్టి కుంహర్రా గ్రామంలో నివసించే 70 ఏళ్ల సీతారాం అనే వృద్ధుడిని ఇప్పటివరకు ఒకే పాము 14 సార్లు కాటు వేసింది. ఈ ఘటనల నుంచి అతడు సేఫ్‌గా బయటపడ్డాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తిరిగి వచ్చి అతడిని కాటు వేయడం గమనార్హం.
సీతారాం సుమారు 35 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మొదటిసారి పాము కాటేసింది. అప్పుడు గ్రామంలోని వైద్యుడు చికిత్స చేయగా, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటి నుండి ఇది తన జీవితంలో ఒక శాపంగా మారిందని వృద్ధుడు వాపోతున్నారు. ఈ సంఘటన గురించి గ్రామస్తులు పలు విషయాలు వెల్లడించారు. కొందరు దీనిని పాము ప్రతీకారం తీర్చుకుంటుందని, మరికొందరు దీనిని గత జన్మలో చేసిన పాపాల ఫలితమని అంటున్నారు. ఇప్పుడు ప్రజలు సీతారాముడిని ‘పాముల బాధితుడు’ అని పిలవడం మొదలుపెట్టారు.
తాజాగా సీతారాం హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు మళ్లీ పాము కాటేసింది. అకస్మాత్తుగా ఆలయ ప్రాంగణంలోని పొదల్లో నుండి ఒక పాము బయటకు వచ్చి, బుసలు కొడుతూ సీతారాంను కాలుపై కాటేసింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సీతారాంకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన స్థానికులలో భయాందోళనలకు కారణమవుతోంది.
భయం లేదు
పాముకాటుపై సీతారాం స్పందించారు. ‘‘నేను నా జీవితంలో చాలా దూరం ప్రయాణించాను. ఇప్పుడు నాకు భయం లేదు. కానీ ఈ పాము నన్ను ఎందుకు వెంటాడుతుందో నాకు అర్థం కావడం లేదు” అని అన్నారు. కాగా సీతారాం పదే పదే ప్రాణాలతో బయటపడటానికి కారణం ఆయన అదృష్టం, బలమైన రోగనిరోధక శక్తి అని వైద్యులు అంటున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఈ శాస్త్రీయ కారణాలను విస్మరించి.. అతడిని ఏదో శక్తి కాపాడుతుందని భావిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా వైరల్‌గా మారింది
