పశ్చిమాఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో తీవ్ర విషాదం సంఘటన చోటు చేసుకుంది. దేశ రాజధాని డాకర్ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఒక గుర్తు తెలియన పడవ కనిపించింది. సముద్రంలో అనుమానాస్పదంగా కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏముందని దగ్గరికెళ్లి చూసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే దృశ్యం కనిపించింది. ఆ పడవలో కుప్పలు తెప్పలుగా మనుషుల మృతదేహాలు కనిపించాయి. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ పడవలో ఏకంగా 30 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. శరీరాలన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు.
ముందు నౌకాదళానికి ఈ పడవ గురించి కొందరు గుర్తు తెలియని వారు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఓ పెట్రోలింగ్ బోటును పంపగా..ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. ఆ పడవ ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొనడంతోపాటు మృతుల సంఖ్యను నిర్ధరించే దిశగా విచారణను ముమ్మరం చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఈ నెల ప్రారంభంలోనూ సెనెగల్ తీరంలో ఓ వలసదారుల పడవ నీట మునిగి సుమారు 37మంది మృతి చెందారు. ఘర్షణలు, పేదరికం, ఉద్యోగాల కొరత వంటి కారణాలతో పశ్చిమ ఆఫ్రికా నుంచి అనేక మంది వలసదారులు సెనెగల్ ద్వారా విదేశాలకు అక్రమంగా వలస పోతుంటారు. చాలా మంది సమీపంలోని స్పెయిన్ కు చెందిన కానరీ దీవులకు వెళ్తుంటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..