చెన్నై, డిసెంబర్ 30: ఓ దొంగగారు అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయాక గుట్టుచప్పుడు కాకుండా చోరీకి బయల్దేరాడు. పోతూపోతూ ఓ బాటిల్ చుక్కేసి వెళ్లాడు. దగదగా మెరిసిపోతున్న ఓ బ్యూటీపార్లర్‌పై కన్నేశాడు. చాకచక్యంగా తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించాడు. ఆ తర్వాత వచ్చిన పనికానిచ్చి బయల్దేరకుండా.. మేడ మీదకు వెళ్లి ఫ్యాన్ వేసుకుని మద్యం మత్తులో వచ్చిన సంగతి మరచి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం సిబ్బంది వచ్చేంత వరకూ గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నాడు. ఇంకేముంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో గత శుక్రవారం చోటు చేసుకోగా శనివారం ఉదయం (డిసెంబర్ 28) వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..
చెన్నై అమింజకరై నెల్సన్ మాణిక్కంసాలైలో నెల్సన్ మాణికం రోడ్‌లో ఓ బ్యూటీపార్లర్ ఉంది. శుక్రవారం రాత్రి పార్లర్‌కి తాళం వేసి అక్కడి సిబ్బంది వెళ్లిపోయారు. శనివారం ఉదయం వచ్చి చూడగా తలుపులు బార్లా తెరచి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. లోనికెళ్లి చూడగా వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు గుర్తించారు. ఇంతలో పార్లర్ మేడపై నుంచి గురక శబ్దం రావడం గమనించి.. అంతా పైకెళ్లి వెళ్లారు. అక్కడి దృశ్యం చూసి అంతా నోరెళ్లబెట్టారు.
మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు హాయిగా నిద్రపోతుండటం వారి కంటపడింది. దీంతో పోలీసులు అతన్ని నిద్ర లేపి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసుల దర్యాప్తులో.. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పుల్‌పురానికి చెందిన శ్రీధర్ (24)గా తేలింది. అనంతరం అతని వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. నిందితుడు శ్రీధర్‌పై అమింజికరై, మీనంబాక్కంలోని పోలీస్ స్టేషన్లలో పలు నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు వెల్లడించారు.ఈ మేరకు పోలీసులు ఆదివారం మీడియాకు తెలిపారు.