YSR’s 73rd Birth Anniversary: రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే వైఎస్ఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ 73 జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్ఆర్ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ పొందిన నేత వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజ్ రియంబర్స్‌మెంట్, జలయజ్ఞం, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే వైఎస్ఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. వైఎస్ఆర్ గొప్ప రాజనీతజ్ఞుడు అని, అలాంటి మహనీయుడికి హైదరాబాద్‌లో స్మృతి వనం లేకపోవడం అవమానకరం అని అన్నారు. కుల సంఘాల భవనాలకు స్థలాలు ఇస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. వైఎస్ఆర్ స్మృతి వనం కూడా నిర్మించాలని రేవంత్ డిమాండ్ చేశారు. 12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, రాగానే వైఎస్ఆర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని అన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు.
నాయకుడు అంటే, పాలకుడు అంటే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే మొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవరు అంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునే చెబుతారని తెలంగాణ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఆయన నిరంతరం ప్రజల కోసమే పని చేశారని తెలిపారు. సంక్షేమంతో పాటు దేశానికి అభివృద్ధిని చూపిన మహనీయుడు వైఎస్ఆర్ అని కీర్తించారు. నిరుద్యోగ యువతి, యువకుల కోసం అనేక ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన లేని లోటు మనందరికీ బాధాకరం అన్నారు భట్టి విక్రమార్క. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు సమసమాజ స్థాపన కోసమేనని అన్నారు. ఉచిత విద్యుత్‌కి ఆద్యుడు వైఎస్ఆర్ అని అన్నారు. వైఎస్ఆర్ తమ అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తామన్నారు.