Telangana: యూట్యూబ్‌లో వీడియో చూశాడు.. ఏటీఎంలోకి దూరాడు.. సీన్ కట్‌చేస్తే..
జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది యువకులు అడ్డదారులను తొక్కుతున్నారు. ఆధునిక టెక్నాలజీ, యూట్యూబ్‌లో వీడియోల స్ఫూర్తితో యువత దొంగతనాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం యూట్యూబ్ చూసి ఓ దొంగతనానికి స్కెచ్ వేశారు. కానీ చివరికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు కేటగాళ్లు రోజురోజుకూ కొత్త వ్యూహాలను రచిస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం నేరాలకు పాల్పడుతున్నారు. తాజగా అలాంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నేరేడుచర్ల మండలం శ్రీరామాపురంకు చెందిన మోతుకూరి రమణాచారి, ఏపీకి చెందిన మోహన్ కుమార్ రెడ్డిలు జడ్చర్లలో స్నేహా ఫుడ్స్ సెక్యూరిటీగార్డు సూపర్వైజర్లుగా పని చేస్తున్నారు. అయితే ఉద్యోగంతో వచ్చే జీతం సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అనుకున్నారు. దీంతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వైటీపీఎస్ లో ఉద్యోగం కోసం లావూడితండాకు చెందిన రమేషన్ ను గత నెల 23న కలిశారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ముగ్గురు కలిసి వైన్స్ లో మద్యం సేవించారు.
రమేష్ వెళ్లిపోగా రమణాచారి, మోహన్ రెడ్డిలు రాత్రి అక్కడ ఉన్న డీబీఎస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని భావించారు. దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూశారు. అదే రోజు రాత్రి ముఖాలకు మాస్క్ లు వేసుకొని రాడ్డుతో ఏటీఎంలోకి ప్రవేశించారు. యంత్రాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించగా సైరన్ మోగడంతో భయపడి పారిపోయారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు ఇద్దరు జడ్చర్లలో తిరిగి సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాల్లో చేరారు.
ఏటీఎం చోరీపై కేసు నమోదు చేసుకున్న వాడపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించి నిందితులతో కలిసి ఉన్న రమేష్ ను విచారించి నిందితులను గుర్తించారు. రామాపురంలోని తన ఇంటికి వచ్చిన రమణాచారి, మరో నిందితుడు మోహన్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్లు సిఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపారు. ఏటీఎం పగులగొట్టేందుకు ఉపయోగించిన ఇనుపరాడ్డు, బ్యాగ్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
