Telangana: పోదెం వీరయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలి.. యూత్ కాంగ్రెస్ డిమాండ్

పోదెం వీరయ్య ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. గతంలో ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్య మొదటి నుంచి కాంగ్రెస్ పక్షానే ఉంటూ వస్తున్నారు. ఎప్పుడూ పార్టీ ఛేంజ్ అవ్వలేదు. అయితే.. అప్పట్లో ములుగు సీటు సీతక్కకు సీటు ఇవ్వాల్సి వచ్చినందున పొదెంను భద్రాచలంకు షిఫ్ట్‌ చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. 15 రోజులు మందు అక్కడి వచ్చి కూడా భద్రాచలంలో పాగా వేయగలిగారు. 2023 ఎన్నికల్లో మాత్రం పరాభవం ఎదురైంది.

Telangana: పోదెం వీరయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలి..  యూత్ కాంగ్రెస్ డిమాండ్
Youth Congress Leaders

Updated on: Mar 04, 2025 | 4:27 PM

కొత్తగూడెం భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షులు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గడ్డం రాజశేఖర్, భద్రాచలం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యెడారి ప్రదీప్ అధిష్టానాన్ని కోరారు. జిల్లా కేంద్రం కొత్తగూడెం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతు వీరయ్య పార్టీకి వీర విధేయుడిగా చెప్పారు.  ములుగు ఎమ్మెల్యేగా గెలిచి, సీతక్క కోసం సిట్టింగ్ స్థానాన్ని వదిలి 2018 ఎన్నికల సమయంలో భద్రాచలం నుంచి పోటీ చేసి కేవలం 14 రోజుల్లోనే అందరి మద్దతు కూడకట్టుకుని ఎమ్మెల్యేగా గెలిచినా సందర్భాన్ని గుర్తుచేశారు. పొదెం వీరయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వాది అని ఎప్పుడూ పార్టీ ఫిరాయించలేదన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్ని అడ్డంకులు ఎదురైనా, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీని వీడకుండా కరుడగట్టిన కాంగ్రెస్ వాదిగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం… పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని చెప్పుకొచ్చారు.  గిరిజన ఆదివాసీ ముద్దుబిడ్డ పొదెం వీరయ్యకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గిరిజన శాఖ మంత్రిగా నియమించాలని యువజన కాంగ్రెస్ తరపున ఏఐసీసీ, పీసీసీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

మాజీ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు తీరుతో పార్టీ చిన్నాభిన్నం అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులను ఏకతాటిపై నిలిపిన పొదెం వీరయ్య 2023 ఎన్నికల్లో మిత్రపక్షమైన సిపిఐ వల్లే ఓటమి పాలయ్యారని యూత్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పార్టీ కోసం చేసిన సేవలు గుర్తించి ఇకనైన ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్‌లోకి తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు బర్గాడి సన్నీ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ సెక్రెటరీ చుండ్రాల సుధీర్ , యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ భద్రాచల అసెంబ్లీ నియోజకవర్గం అధ్యక్షులు ఎడారి ప్రదీప్ యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..