భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్‌ చేస్తే ఆ ఆనవాళ్లతో..

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలుకు ఒక్కగానొక్క కూతురు పద్మ. యాదయ్య, అలివేలు ఇద్దరు కూలి పనిచేసుకుంటూ ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం పద్మకు మహబూబ్ నగర్..

భర్తను లేపేసి ఏం తెలియనట్లు నటించింది.. కట్‌ చేస్తే ఆ ఆనవాళ్లతో..
Crime

Edited By:

Updated on: Jun 27, 2026 | 9:33 PM

అల్లుడితో వివాహేతర సంబంధం ఆరోపణలు, ఆస్తి తగాదాలతో కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. కూతురు, అల్లుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసి.. అనారోగ్యంతో మరణించినట్లు అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా చివరి నిమిషంలో అసలు విషయం బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామానికి చెందిన అమ్మపల్లి యాదయ్య, అలివేలుకు ఒక్కగానొక్క కూతురు పద్మ. యాదయ్య, అలివేలు ఇద్దరు కూలి పనిచేసుకుంటూ ఎకరన్నర పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం పద్మకు మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని బోయిన్ పల్లి గ్రామానికి చెందిన బండారి అంజనేయులుతో వివాహం జరిపించారు. అంజనేయులు సెంట్రింగ్ పనిచేస్తుండగా.. పద్మ కూలి పనులకు వెళ్తోంది. అంతా సాఫిగా సాగుతున్న క్రమంలో వివాహేతర సంబంధం, వ్యవసాయ భూమి చిచ్చు రేపింది.

భర్త యాదయ్య పేరుపై ఉన్న ఎకరంన్నర పొలాన్ని అల్లుడికి ఇవ్వాలని అలివేలు గత రెండేళ్లుగా ఒత్తిడి తేస్తోంది. దీనికి తోడు అల్లుడితో అలివేలు వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం కలిగింది. దీంతో రెండు అంశాలపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అల్లుడికి భూమిని ఇచ్చేందుకు యాదయ్య అంగీకరించడం లేదు. తన భర్త బ్రతికి ఉన్నన్ని రోజులు భూమి అల్లుడి పేరుపై మారదని భావించిన భార్య అలివేలు.. కూతురు పద్మ, అల్లుడు అంజనేయులుతో కలిసి భర్త హత్యకు స్కేచ్ వేసింది. ఈ నెల 23న మధ్యాహ్నం భర్తతో గొడవపడి కూతురు, అల్లుడిని ఇంటికి పిలిపించింది. ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారం అల్లుడు అంజనేయులు మామ యాదయ్య మెడను గట్టిగా పట్టుకొని గోడకేసి బాదాడు. దీంతో యాదయ్య కిందపడిపోగా.. కూతురు పద్మ యాదయ్య కాళ్లు గట్టిగా అదిమి పట్టుకుంది. వెంటనే అత్త అలివేలు ఇనుపరాడ్ తో యాదయ్య ఛాతిపై బలంగా కొట్టింది. ఆ తర్వాత యాదయ్య వృషణాలపై దాడి చేసింది. దీంతో యాదయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం.. బంధువులకు అడ్డంగా దొరికిపోయి

ఇక యాదయ్య మరణించాడని ధృవీకరించుకున్నాక.. కూతురు, అల్లుడు ఏమి ఎరగనట్లు స్వగ్రామమైన బోయినపల్లికి వెళ్లిపోయారు. ఇక తెల్లవారు తన భర్త అనారోగ్య సమస్యలతో అకాల మరణం చెందాడని బంధువులు, ఇరుగుపొరుగు వారికి చెప్పింది అలివేలు. అందరూ వచ్చాక అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా యాదయ్య శరీరంపై ఉన్న గాయాల చూసి బంధువులకు అనుమానం కలిగింది. వెంటనే అందరూ అలివేలును గట్టిగా నిలదీయడంతో అసలు విషయం తెలిపింది. ఇక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటకి వచ్చింది.

యాదయ్య భార్య అలివేలు, కూతురు పద్మ, ఆమె భర్త అంజనేయులును అదుపులోకి తోసుకొని విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. అల్లుడితో వివాహేతర సంబంధాలు, భూమి కోసం జరుగుతున్న గొడవలు యాదయ్య హత్యకు కారణాలుగా పోలీసులు తేల్చారు. నిందితులైన యాదయ్య భార్య అలివేలు, కూతురు పద్మ, ఆమె భర్త అంజనేయులును అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. కుటుంబ బంధాలు, ఆస్తి వివాదాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us