
అన్నీ అయిపోయాయ్. రేపోమాపో కాంగ్రెస్‌లో కలవడమే మిగిలిందనుకున్నారు. తను కూడా ఢిల్లీ పెద్దలకు టచ్‌లో ఉన్నారు. కర్నాటక పీసీసీ చీఫ్ డీకేతో అన్ని అంశాలు మాట్లాడుతున్నారు. కానీ నేడోరేపో అంటున్నా ఆ ప్రక్రియ దిశగా అడుగుపడటం లేదు. ఆమె కూడా అవునని ఒప్పుకోవడం లేదు. కాదని ఖండించడం లేదు. కాంగ్రెస్‌లో చేరతారో లేదోగానీ.. మళ్లీ అమ్ములపొదిలోని అస్త్రాలైతే బయటికి తీస్తున్నారు వైఎస్ షర్మిల. గ్యాప్ రాలేదు.. నేనే తీసుకున్నానన్నట్టు మళ్లీ న్యూస్‌లోకొచ్చారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కి టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను హౌస్ అరెస్ట్ చేయటంతో లోటస్‌పాండ్ దగ్గర కాసేపు టెన్షన్ వాతావరణం నడిచింది. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తారన్న ప్రచారం తర్వాత.. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు వైఎస్ షర్మిల. కానీ మళ్లీ ఇప్పుడు యాక్టివ్ కావటంతో కాంగ్రెస్‌లో ఆమె చేరిక ఉన్నట్టా లేనట్టా అన్న చర్చ మొదలైంది. పోలీసులు తనను ఇల్లు కదలనివ్వకపోవటంతో.. వారికి హారతి ఇచ్చి మరీ నిరసనకు దిగారు షర్మిల.
తాజా పరిణామాలతో అవసరమైతే ఒంటరి పోరాటానికైనా సిద్ధమేనన్న సంకేతాలిచ్చారు వైఎస్ షర్మిల. తన ప్రతిపాదనలకు ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌లో చేరాలన్న పట్టుదలతో ఆమె ఉన్నట్టు కనిపిస్తోంది. పాలేరు నుంచి పోటీచేస్తానని ఇప్పటికే ప్రకటించిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తన మద్దతుదారులకు కూడా షర్మిల కొన్ని సీట్లు అడుగుతున్నారన్న మాట వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌లో షర్మిల చేరికని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆమెకు వెల్‌కం చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనానికి అంగీకరించినా అసెంబ్లీకి షర్మిల పోటీపై మాత్రం ససేమిరా అంటున్నారట రేవంత్. అక్కడే మెలికపడిందని, అవసరమైతే షర్మిలను లోక్‌సభకు పోటీ చేయించడానికి, రాజ్యసభకు పంపడానికి కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నది ఇంటర్నల్ టాక్.
టీ కాంగ్రెస్‌లో కొందరు సూచిస్తున్నట్లు ఏపీ పాలిటిక్స్‌పై షర్మిల ఆసక్తిగా లేరు. పార్టీ కేంద్రనాయకత్వంతో మాట్లాడుతున్న డీకేతో అదే విషయం చెప్పేశారట షర్మిల. పార్టీని రద్దు చేసి కాంగ్రెస్‌లో చేరడమా, లేదంటే కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీని విలీనం చేయడమా అన్న రెండు ప్రతిపాదనలు కూడా షర్మిల ముందు ఉన్నాయంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. షర్మిల చేరిక పార్టీకి ఎంతోకొంత మేలు జరుగుతుందన్న అంచనాతో ఉంది. కానీ ఆమె డిమాండ్లు, టీపీసీసీ చీఫ్ అభ్యంతరాలతోనే.. ఉభయతారకంగా ఉండే నిర్ణయం విషయంలో ఆలస్యమవుతోంది. ఈలోపు నా దారి నాకుందన్న సంకేతాలిచ్చేందుకే మళ్లీ షర్మిల యాక్టివ్ అవుతున్నారన్నది కొందరి ఒపీనియన్. అసలే రాజన్నబిడ్డ.. అంతీజీగా రాజీపడుతుందా? చెప్పండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..