
లెక్కలు తేలాలి. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి పదే పదే వినిపిస్తున్న మాటలు. మేం చెప్పినవన్నీ చేస్తాం అంటూనే.. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఏంటనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పథకాలను అమలు చేస్తూనే.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగానే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలనే దానిపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది. విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ రంగంపై శ్వేతపత్రం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని మంత్రులు పదే పదే చెబుతున్నారు.
శ్వేతపత్రంతో గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఏం జరిగిందనే విషయాన్ని లెక్కలతో ప్రజల ముందు ఉంచాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా గతంలో ఏం జరిగిందనే విషయాన్ని ప్రజలకు వివరించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసేందుకు శ్వేతపత్రం అధికార పార్టీకి ఒక అస్త్రంగా నిలుస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. అధికారం చేపట్టిన రోజు నుంచే శ్వేతపత్రం విడుదలపై కాంగ్రెస్ ప్రకటనలు చేస్తుండటంతో.. వైట్ పేపర్ విడుదలైతే తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..