Hyderabad Rains: సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగి తెలుతున్న భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు. గత మూడు రోజుల నుంచి మబ్భులతో ఉన్న హైదరాబాద్ లో (hyderabad) శనివారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈదురుగాలులతో నగరం మరింత చల్లబడింది. ఒక్కసారిగా నగరంలో భారీ వర్షం (Rains) కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి భాగ్య నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు నదులను తలపించాయి. వాహన దారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పాతం నమోదైంది. రాత్రి 12 గంటల వరకు నాచారంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఉప్పల్‌లో 9, కాప్రాలో 8.4, సరూర్‌నగర్ 7.7, సైదాబాద్ 5.6, మల్లాపూర్ 5.5 సెంటీమీటర్ల మేర వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు.
భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. సహయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి పలు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పాతబస్తీ, ఉప్పల్, తార్నాక పరిధిలో సహాయక చర్యలు చేపట్టారు. పాతబస్తీలో కురిసిన భారీ వర్షానికి మీరాలంమండి కూరగాయల మార్కెట్ జల మాయమైంది. ఇక సికింద్రాబాద్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. తార్నాకలోని పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉప్పల్ నుంచి మౌలాలి వరకూ ఎడతెరపి లేకుండాల వర్ష కురవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో రహదారిపై భారీగా నీరు చేరుకుంది. దీంతో జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలను చేపట్టి.. వాహనదారుల ఇబ్బందులను తొలగించారు.