తెలంగాణలో 2023 అక్టోబర్ నుంచి తీవ్ర వర్షాభావం వెంటాడుతోంది. సాధారణంగా కురవాల్సిన వర్షపాతంతో పోలిస్తే 56.7% లోటు ఉండటంతో ఆందోళన మొదలైంది. నిరుడు సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53% అధికంగా వర్షాలు కురిశాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 5% అధిక వర్షపాతం కనిపించినా.. అక్టోబర్ నుంచి ఆశించినట్లుగా వర్షాలు లేకపోవడం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. 2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు సాధారణంగా 136.9 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మి.మీ.ల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రంలో ఉన్న 14 ప్రధాన రిజర్వాయర్లు దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీనిపై ఫోకస్ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం వేధిస్తున్న నీటి సమస్యపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. సమీక్షలు నిర్వహించి జలాశయాల్లో ఉన్న నీటి లభ్యత వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలు, అవసరాన్ని బట్టి పక్క రాష్ట్రాల నుంచి నీటిని తెచ్చుకోవటం ఇలాంటి పలు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది రాష్ట్ర సర్కార్. అనుకోకుండా ఏర్పడిన కరువు పరిస్థితి ప్రస్తుతం పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారింది. ఇక హైదరాబాద్ కి ప్రధానంగా నీరు అందించే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చెరువుతోపాటు మూసీ నుంచి కూడా నీటిని వినియోగిస్తారు. అవసరాన్ని బట్టి నాగార్జునసాగర్ ఎల్లంపల్లి సింగూర్ రిజర్వాయర్ల నుంచి కూడా నీటిని తరలిస్తారు.
ఈ నేపథ్యంలోనే ఎండాకాలంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు సరిపడా నీరు జలాశయాల్లో ఉన్నాయని హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో నీటి అవసరానికి 2300 mld ల నీరు అవసరం వినియోగిస్తుండగా ప్రస్తుతం 2450 mld ల నీరు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తానికి అవసరాన్ని బట్టి 700 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని గత ప్రభుత్వం కన్నా ఎక్కువగానే నీటిని సరిపడా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాదులో ప్రస్తుతం 700 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి అన్నారు.
ఇక సీఎం సమీక్షలో కూడా అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున 140 కోట్లను మంచినీటి అవసరం కోసం కేటాయించారు. అవసరమైతే రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు నీటి సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే హైదరాబాదులో కొన్ని ప్రదేశాల్లో ఉద్దేశ పూర్వకాన్ని నీటి సమస్యను సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశా.రు అలాంటి అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
ఇక హైదరాబాద్‌లో ఎక్కడ నీటి సమస్య ఏర్పడిన ఒక ఫోన్ కాల్‌తో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే ‘155313’ కాల్ చేస్తే వెంటనే స్పందించి వాటర్ టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…