Godavari Floods: మళ్లీ కలవరపెడుతున్న గోదావరి.. క్రమంగా పెరుగుతున్న వరద.. భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం

|

Sep 12, 2022 | 1:37 PM

జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి (Godavari) వచ్చిన వరదలను మరవకముందే మరోసారి నదిలో ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండటంతో పరివాహకప్రాంత ప్రజలు భయంతో..

Godavari Floods: మళ్లీ కలవరపెడుతున్న గోదావరి.. క్రమంగా పెరుగుతున్న వరద.. భద్రాచలం వద్ద ప్రమాదకరంగా ప్రవాహం
Bhadrachalam
Follow us on

జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి (Godavari) వచ్చిన వరదలను మరవకముందే మరోసారి నదిలో ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు నీటిమట్టం పెరుగుతుండటంతో పరివాహకప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. శ్రీరామసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక పెరుగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. భద్రాద్రి జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరిలో 37.19 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఉదయం 9 గంటలకు 33 అడుగులు ఉండగా.. సాయంత్రానికి 37 అడుగులకు చేరడాన్ని చూస్తుంటే ప్రవాహం ఇంకా పేరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ (KCR) ఆదేశాలతో ఎఫెక్ట్ అయ్యే కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహకంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎస్ అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాగా.. జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి ప్రవాహం భారీగా వచ్చింది. వారం రోజులు ఏకధాటిగా కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి దిగువకు వస్తున్న వరద నీటి మట్టం భద్రాచలం వద్ద తీవ్ర స్థాయికి చేరింది. ఒకానొక దశలో 67.9 అడుగులకు నీటిమట్టం నమోదైంది. దీంతో భద్రాచలం పట్టణంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. 1986 తర్వాత మొదటిసారిగా గోదావరి వంతెనపై రాకపోకలను రెండు రోజుల పాటు బంద్ చేశారు.

మరోవైపు కృష్ణా కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆలమట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద వేగంగా వస్తోంది. శ్రీశైలం ఆరు గేట్లు, నాగార్జునసాగర్‌ పది గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉందాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అనవసరంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదుల లోకి దిగవద్దని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం