వరంగల్ ఎంజీఎం లో ఎలుకల ఘటన గురించి మరిచిపోకముందే కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటన సంచలనంగా మారింది. గర్ల్స్ హాస్టళ్లలో నిద్రపోతున్న విద్యార్థుల కాళ్లు చేతులు కొరకుతున్నాయి. ఎలుకల దాడిలో కొందరికి గాయాలయ్యాయి. ఎలుకలు కొరకడంతో గాయాలపాలైన విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .క్యాంపస్ లోని పద్మాక్షి హాస్టల్ ‘డీ’ బ్లాక్ రూం నంబరు-1లో ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చికిత్స కోసం బాధిత విద్యార్థినులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ఘటన జరిగిన గదిలో పారిశుధ్యం లోపించిందని. పనికిరాని వస్తువులన్నీ నిల్వ ఉంచారని దీంతో ఎలుకలు, స్వైర విహారం చేస్తున్నాయంటున్నారు. ఎలుకలతో తాము ఇబ్బందిపడుతున్నామంటూ ఎన్నోసార్లు హాస్టల్స్ కేర్‌టేకర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, హన్మకొండ కాకతీయ వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థినిలు గత కొన్ని రోజులుగా హాస్టల్ వసతి కల్పించాలని వీసీ రమేష్ ను కలిసి సమస్యను వివరించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు కోవాలని ఎన్నో కష్టాలను అధిగమించి వర్సిటీలో సీటు సంపాదించామని.. తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వచ్చిన కూలి పైసలతో వేల రూపాయల ఫీజులు కట్టినా.. హాస్టల్ వసతి కల్పించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం