Telangana: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్.. వచ్చే నెలలోనే శ్రీకారం..!

ఉత్తర తెలంగాణ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. త్వరలో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు మందడుగు పడనుంది. ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తవ్వగా.. రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించింది. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు కూడా పూర్తయ్యాయి.

Telangana: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్.. వచ్చే నెలలోనే శ్రీకారం..!
Warangal Airport

Updated on: Dec 28, 2025 | 5:07 PM

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో మరో ఎయిర్‌పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. అదే వరంగల్ ఎయిర్‌పోర్ట్. వరంగల్‌లోని మామునూరులో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి ఎప్పటినుంచో కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ పూర్తవ్వగా. . త్వరలో భూమిపూజకు రంగం సిద్దమైంది. జనవరిలో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారని సమాచారం. 2027 చివరి నాటికి ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అత్యాధునిక హంగులతో వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలని అనుకుంటోంది. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మిస్తోంది.

పూర్తయిన భూసేకరణ ప్రక్రియ

 

వరంగల్ మామూనూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం ఇప్పపటికే భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. గతంలో 696.14 ఎకరాలను సేకరించగా.. ఇటీవల 253 ఎకరాలను సేకరించారు. మొత్తం 950 ఎకరాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీకి ప్రభుత్వం అప్పగించింది. రైతులకు ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పును పరిహారం అందించింది. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా భూములను ఎయిర్‌పోర్ట్ కోసం ప్రభుత్వం సేకరించింది. శనివారం భారత విమానయాన సంస్థ హైదరాబాద్ మేనేజర్ బి.వి రావు ఎయిర్‌పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించారు. వరంగల్‌లో ఐటీ పార్క్, కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ లాంటి పెద్ద సంస్థలు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ రాకతో ఉత్తర తెలంగాణ మరింతగా అభివృద్ది చెందనుంది. దీని వల్ల పెట్టుబడులు మరింతగా పెరిగి వరంగల్ పరిసర జిల్లాలు మరింతగా అభివృద్ది చెందే అవకాశముంది.

దేవాలయాలకు పెరగనున్న గుర్తింపు

వరంగల్‌లో అనేక చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. రామప్ప దేవాలయం ఇప్పటికే యునెక్కో గుర్తింపు సంపాదించింది. ఇక వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట వంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్ రాకతో పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఈ ప్రదేశాలకు మరింత గుర్తింపు దక్కనుంది. ఇక స్థానికంగా హోటల్ రంగం, రవాణా రంగం మరింత పుంజుకునే అవకాశలు ఉంటాయి. దీని వల్ల వేలమందికి ఉపాధి లభించే ఛాన్స్ ఉంటుంది.