Errabelli Dayakar rao – Palm Oil Crop: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల వరంగల్ ప్రాంతం సస్యశ్యామలమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు. వరంగల్ జిల్లాలో రైతులను మరింత పైకి తీసుకురావాల్సి ఉందన్న మంత్రి.. పామాయిల్ పంటల వల్ల చాలా లాభం ఉంటుందని చెప్పారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా ముఖ్యమంత్రి చేపడుతున్నారన్నారు మంత్రి ఎర్రబెల్లి. రైతుల విషయంలో అన్ని రాష్ట్రాల కన్నా కేసీఆర్ ఎక్కువే చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఉదయం ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కోసం రైతులతో కలిసి వరంగల్ నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వెళ్లారు ఎర్రబెల్లి. పామాయిల్ సాగు పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం కోసం వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన రైతులతో కలిసి ఎర్రెబల్లి ఈ పర్యటనకు పూనుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ నుండి జెండా ఊపి మంత్రి యాత్రను ప్రారంభించారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేట మండలాల్లో పామాయిల్ తోటలను మంత్రి రైతులతో కలిసి పరిశీలించారు. దమ్మపేట మండలంలోని అల్లిపల్లి గ్రామంలో పామాయిల్ రైతులతో సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, స్థానిక అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.