తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాటీల్లో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇవాళ జరిగిన వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్.. ఐదు మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ఎన్నుకున్నారు. అయితే, రెండు కార్పొరేషన్లకు మహిళలే మేయర్లు కాగా, మరో మూడు మున్సిపాల్టీల్లోనూ చైర్‌పర్సన్ పదవులు మహిళలకే దక్కాయి. వారి పేర్లను సీల్డ్ కవర్‌లో సీక్రెట్‌గా తీసుకువచ్చిన టీఆర్ఎస్ పార్టీ పరిశీలకు ఇవాళ ప్రకటించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. మేయర్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్‌గా రిజ్వానా షమీమ్ పేర్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి కలిసి ప్రకటించారు. మరికాసేపట్లో వీరిద్దరూ ప్రమాణం చేయనున్నారు. గుండు సుధారాణి 29వ డివిజన్ నుంచి గెలుపొందగా, రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలుపొందారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీఆర్ఎస్ 48, బీజేపీ 10, కాంగ్రెస్ 4, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. మేయర్‌గా పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా జోహ్రో పేర్లను ఖరారు చేసింది. వీరిద్దరి పేర్లను ఎన్నికల పరిశీలకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. పునుకొల్లు నీరజ 26వ డివిజన్ నుంచి గెలుపొందగా, ఫాతిమా జోహ్రా 37వ డివిజన్ నుంచి గెలుపొందారు. ఖమ్మం మున్పిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 60 స్థానాలకు టీఆర్ఎస్ 45 డివిజన్లలో, కాంగ్రెస్ 10, ఇతరులు 5 డివిజన్లలో గెలుపొందగా, బీజేపీ ఒక డివిజన్‌లో మాత్రమే గెలిచింది.
సిద్దిపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్‌గా జంగిటి కనకరాజు పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. నూతన కార్పొరేటర్ల సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను మంత్రి హరీష్ రావు, ఎన్నిక పరిశీలకులు రవీందర్ సింగ్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి కలిసి ప్రకటించారు. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు గానూ టీఆర్ఎస్ 36, బీజేపీ 1, ఇతరులు 6 స్థానాల్లో గెలుపొందారు. టీఆర్ఎస్ రెబల్స్ అందరూ మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.