Telangana: వరంగల్‌ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ అరెస్ట్

రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ వద్ద ACB అధికారులు భారీగా అక్రమాస్తులను గుర్తించారు. దాదాపు రూ.4.04కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. వరంగల్‌ డీటీసీగా గత సంవత్సరం ఫిబ్రవరిలో పుప్పాల శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆయనపై అభియోగాలు రావడంతో..అధికారులు సోదాలు నిర్వహించారు.

Telangana: వరంగల్‌ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ అరెస్ట్
Puppala Srinivas

Updated on: Feb 08, 2025 | 4:39 PM

హనుమకొండ జిల్లా రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో.. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో శుక్రవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హనుమకొండ పలివేల్పుల పరిధిలోని దుర్గాకాలనీలో డీటీసీ శ్రీనివాస్‌ ఇంట్లో సోదాలు చేసి.. ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన డాక్యుమెంట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. శ్రీనివాస్‌ ఇంట్లో భారీగా లభ్యమైన విదేశీ మద్యం బాటిల్స్‌ను సీజ్‌ చేశారు.

పుప్పాల శ్రీనివాస్‌ స్వస్థలమైన జగిత్యాలతోపాటు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సుమారు 10 గంటలపాటు విచారించి.. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించారు. ఆ తర్వాత హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తీసుకెళ్ళి పలు అంశాలపై సమాచారం సేకరించారు.

పుప్పాల శ్రీనివాస్‌ ఇళ్లు, కార్యాలయాల్లో నిన్న ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. మొత్తం 4 కోట్ల నాలుగు లక్షల ఆక్రమాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు 16 ఓపెన్‌ ప్లాట్లు ఉన్నాయి. దాంతో.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఇక.. గతేడాది ఫిబ్రవరిలో హనుమకొండ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన పుప్పాల శ్రీనివాస్‌.. అంతకుముందు హైదరాబాద్‌ రవాణాశాఖ కార్యాయలంలో పనిచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..