Telangana: వారం రోజులు అడవిలో క్యాంపింగ్ వేస్తూ.. పులులను లెక్కించే చాన్స్.. ఇలా చేయండి..

అడవిలో తిరుగుతూ పులుల గర్జనలు, జింకల జంపులు చూడాలని ఉందా? తెలంగాణ అటవీశాఖ ఇప్పుడు ఆ అవకాశం మీకోసం తెరచింది. అఖిల భారత పులుల లెక్కింపు–2026లో భాగంగా సాధారణ ప్రజలకే వాలంటీర్లుగా పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి ...

Telangana: వారం రోజులు అడవిలో క్యాంపింగ్ వేస్తూ.. పులులను లెక్కించే చాన్స్.. ఇలా చేయండి..
Tiger Census

Edited By: Ram Naramaneni

Updated on: Nov 05, 2025 | 6:56 PM

తెలంగాణ అడవులలో పులుల గాండ్రింపులు, జింకల జంపులు, నెమళ్ల నృత్యాలు చూడాలని ఉందా? ఇప్పుడు ఆ అరుదైన అవకాశం ఇప్పుడు మీ సొంతం. రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత పులుల లెక్కింపు – 2026 కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి వన్యప్రాణుల లెక్కింపులో సాధారణ ప్రజలకూ వాలంటీర్లుగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. నవంబర్ 3 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరి తేదీ నవంబర్ 22. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన ఎవరికైనా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. రోజుకు 10–15 కిలోమీటర్లు నడవగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. వారం రోజుల పాటు అడవిలో ఫారెస్ట్ క్యాంప్‌లలో ఉండేందుకు సిద్ధంగా ఉండాలి.

వాలంటీర్లు ఫారెస్ట్ అధికారులతో కలిసి అడవుల్లో తిరుగుతూ పులులు, ఇతర వన్యప్రాణుల ఉనికి గుర్తించాలి. దీనిలో భాగంగా “ట్రాన్సెక్ట్ వాక్స్” నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 2026 జనవరి 17 నుండి 23 వరకు ఈ భారీ వన్యప్రాణి సర్వే జరగనుంది. తెలంగాణలో సుమారు 26,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రదేశంలో ఈ లెక్కింపు జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా నిలిచే అవకాశం ఉంది.

ఈ వాలంటీర్ ప్రోగ్రామ్ పూర్తిగా సేవా కార్యక్రమం. ఎటువంటి జీతం లేదా భత్యం ఉండదు. కానీ వసతి, ఫీల్డ్ ట్రాన్స్‌పోర్ట్ వంటి అవసరాలను అటవీశాఖే చూసుకుంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి https://tinyurl.com/aite2026tg విజిట్ చేయండి. సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్: 1800-425-5364 సంప్రదించవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…