ఓ వైపు దేశం చంద్రుడిలో అడుగు పెట్టింది… మరోవైపు సూర్యుడిని అధ్యయనం చేయడానికి రెడీ అవుతోంది.. అయినప్పటికీ నేటికీ కనీస సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. విద్య, పౌష్టికాహారం, వైద్యం లభించని అనేకమంది ప్రజలు ఉన్నారు. తాజాగా ఓ గర్భిణీ స్త్రీని వైద్యం కోసం తరలించడానికి డోలీలో పెట్టుకుని తరలించారు. ఓ గ్రామానికి చెందిన గిరిజన తండాకు చెందిన గర్భిణిని డోలిపై పడుకోబెట్టి 20 కి.మీ. భుజాలపై మోసిన హృదయ విదారక ఘటన తెలంగాణాలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న గర్భిణిని గ్రామస్తులు డోలీలో తీసుకుని మట్టి రోడ్డులో ఏటినీ దాటుతూ అడవిలో నడిచి వెళ్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రామంలో కనీస వసతులు లేని వైద్య సదుపాయాలు లేకపోవడంతో రోజూ గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో గ్రామస్తులు ఓ గర్భిణిని ‘డోలీ’లో మోసుకుని వెళ్లారు. జోరున కురుస్తున్న వర్షంలో గర్భీణీని భుజాలపై మోసుకెళ్లడం వీడియోలో చూడవచ్చు. గ్రామస్తులు మహిళను డోలీలో తీసుకుని వర్షంలో తడుస్తూ ఏకంగా తమ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
4TV UPDATES **Tribals carrying a pregnant woman to a hospital, as there is no road connectivity in Charla mandal in Bhadradri-Kothagudem district pic.twitter.com/VkDG3r2feC
— Shakeel Yasar Ullah (@yasarullah) September 6, 2023
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తెలంగాణ జిల్లాలోని బోధనిల్లి గ్రామ పంచాయతీ కోర్కట్‌పాడు గ్రామంలో మరక్కం కోసి అనే 22 ఏళ్ల గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతోంది. ఆమెకు సహాయంగా వచ్చిన గ్రామస్తులు రెండు వెదురు ముక్కలకు నులకమంచం కట్టి డోలీని తయారు చేసి, ఆమెను అందులో పడుకోబెట్టి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. గర్భిణిని ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటల్లోనే ప్రసవించింది. అధిక రక్తపోటు కారణంగా ఆమెకు సిజేరియన్ చేసి శిశివుని బయటకు తీశారు. మగబిడ్డ కు జన్మనిచ్చింది. పిల్లాడు ఆరోగ్యంగా 2.6 కిలోల బరువుతో ఉన్నాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గర్భిణిని ‘డోలీ’లో ఎక్కించుకుని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడం ఇదే మొదటిసారి కాదు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలోని దాదాపు 25 గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. కోర్కట్‌పాడు కుగ్రామంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు ఉన్నాయి, మొత్తం జనాభా 200.. ఈ గ్రామంలో మాత్రమే కాదు సమీప గిరిజన తండాల్లో ఎవరికైనా వైద్యం చేయించాలంటే ఇంత దూరం నడవాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..