
మనిషి ప్రాణానికి వెల ఎంత..? లక్షలా..? కోట్లా..? అంటే.. అంతా ఒక్కసారిగా కోప్పడతాము.. ఎందుకంటే.. మనిషి ప్రాణానికి నిర్దిష్టమైన వెల కట్టలేము.. అది విలువైనది, అమూల్యమైనది.. కానీ ఈ ఘటన వింటే మీరు షాక్ అవుతారు. కేవలం 22 రూపాయల కోసం ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ షాకింగ్ ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం రేపింది. 22 రూపాయల పాత బాకీ విషయంలో గొడవపడి వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసాడు ఓ ప్రబుద్ధుడు..ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ చెందిన మహ్మద్ సిరాజ్ అనే వ్యక్తి సంక్రాంతి పండుగ రోజున చేగుంట మండలం అనంతసాగర్ వద్ద హత్యకు గురయ్యాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి.
వలస పనుల కోసం సిరాజ్ తో పాటు అదే రాష్ట్రానికి చెందిన మహేష్ కుమార్ వర్మ ఇక్కడికి వచ్చారు.. వీరిద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. కాగా సంక్రాంతి పండుగ రోజు మద్యం తెచ్చుకొని చెట్టుకింద కూర్చొని తాగుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కుమార్ వర్మ.. సిరాజ్ కి 22 రూపాయలు పాతబకాయి ఉన్నాడు.
ఆ డబ్బులు ఇవ్వాలని మహేశ్ పలుమార్లు అడిగాడు. ఈ విషయం గురించి అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మహేష్ విచక్షణ కోల్పోయాడు. మద్యం మత్తులో ఉండి సిరాజ్ తలను పట్టుకొని బలంగా చెట్టుకు కొట్టాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న బండరాయి తెచ్చి తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఆ తర్వాత అక్కడి నుండి నిందితుడు మహేష్ పారిపోయాడు.. కాగా శనివారం మాసాయిపేట వద్ద నిందితుడిని పట్టుకొని విచారణ చేపట్టగా హత్యచేసినట్లు అంగీకరించాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..