
ప్రస్తుతం తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతతో కొనసాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేను రాజకీయ పార్టీలు సైతం సీరియస్‌గా తీసుకున్నాయి. ఓటర్లకు, తమ పార్టీ కేడర్‌కు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఎలాంటి తప్పులు జరగకుండా బూత్ స్థాయిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఆసక్తికరమైన, బాధ్యతాయుతమైన సంఘటన చోటుచేసుకుంది.
వివాహ వేదికపైనే ఓటరు ఫామ్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఈ వినూత్న ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వార్డు సభ్యులు గెడ్డం మహాలక్ష్మి–బజారు దంపతుల కుమారుడు నాగేంద్రకు, లక్ష్మీ స్వాతితో వైభవంగా వివాహం జరిగింది. అయితే, పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వ బూత్ లెవల్ అధికారి (BLO) నేరుగా కల్యాణ వేదికపైకి చేరుకున్నారు. పెళ్లి పీటలపై ఉన్న నూతన దంపతులకు ఓటరు నమోదు/సవరణ ఫామ్‌ను అందజేశారు.
బాధ్యతాయుతమైన చొరవ
అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (BLA) స్వయంగా వరుడి వివరాలను అడిగి తెలుసుకుని, పెళ్లి పీటలపైనే ఆ ఫామ్‌ను పూర్తిగా భర్తీ చేయించారు. ఆ తర్వాత పూర్తి చేసిన దరఖాస్తును తిరిగి బీఎల్‌ఓకు అందజేశారు. పెళ్లి వేడుక హడావుడిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు తీసుకున్న ఈ చొరవ అక్కడికి వచ్చిన అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. సమయం ఏదైనా, బాధ్యత ముఖ్యమంటూ పెళ్లి పీటలపైనే ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.