ఇందూరు ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పసుపు బోర్డు ఆఫీస్‌ను ప్రారంభించారు. దశాబ్దాల కల సాకారమైందని.. ఇవాళ పసుపు రైతులకు నిజమైన పండగ అంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారన్నారు. నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారన్నారు. గతంలోనే పసుపుబోర్డు ఏర్పాటుకు ప్రధాని మోదీ.. అనుమతిచ్చినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యమైందన్నారు. పసుపు బోర్డు తొలి చైర్మన్‌గా బీజేపీ సామాన్య కార్యకర్త పల్లె గంగారెడ్డికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన పసుపు పండిస్తారన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. అందుకే పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. పల్లె గంగారెడ్డిపై బృహత్తర బాధ్యత ఉంచామని.. పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలని పీయూష్ గోయల్ సూచించారు.
పసుపు బోర్డు చైర్మన్‌గా తనకు బాధ్యతలు అప్పగించిన బీజేపీ జాతీయ నాయకత్వానికి పల్లె గంగారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) January 14, 2025
పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్ ఇచ్చినప్పుడు అందరూ హేళన చేశారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కానీ పసుపు బోర్డు కలను బీజేపీ సాకారం చేసి చూపించిందన్నారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు రైతుల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు చేసి ప్రధాని మోదీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపుబోర్డుతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.నిజామాబాద్‌కు మరిన్ని సంస్థలను తీసుకువస్తామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..