Kishan Reddy: ఆహంకారంతో మాట్లాడుతున్నారు.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు

|

Jul 11, 2022 | 7:42 AM

Union Minister Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా మీడియా..

Kishan Reddy: ఆహంకారంతో మాట్లాడుతున్నారు.. సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు
Union Minister Kishan Reddy
Follow us on

Union Minister Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా మీడియా సమావేశం పెట్టి చెప్పిందే చెప్పాడని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. నిన్న కేసీఆర్‌ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. కేసీఆర్‌ వ్యాఖ్యాలపై కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత డబ్బా పరనింద అన్నట్టు అసలు విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని మర్చిపోయి తన చిల్లర మాటలు చిల్లర వేషాలతో మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీపై అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గతంలో వర్షం వచ్చినప్పుడు ఏ తప్పులు జరిగాయి, ఏ లోపం కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, వంటి వాటిని ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మర్చిపోయి మరొక్కసారి తన కల్లిబొల్లి మాటలతో అసందర్భ వాచాలత్వం తో అడ్డగోలుగా మాట్లాడారని విమర్శించారు.

ప్రపంచంలోని అనేక విషయాల్ని ఉదహరిస్తూ తనను తాను మహా జ్ఞాని అన్నట్లు అన్ని విషయాలు తనకే తెలిసినట్టుగా తానెంతో అహంకారంతో మాట్లాడారని, బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించడం కేసీఆర్‌ డొల్లతనానికి నిదర్శనమన్నారు.

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంతో బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తన హోదాను మరిచి, హుందాగా వ్యవహరించాల్సింది పోయి చాలా చౌకబారు భాషతో అపహాస్యంగా అవహేళనగా మాట్లాడటం కేసీఆర్‌ అసహనాన్ని అభద్రతా భావాన్ని తన లోపల గూడుకట్టుకున్న భయాన్ని తెలియజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అమాయకులు కారని, అబద్ధాల్ని అసంబద్ధ విషయాల్ని పదేపదే చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని, కేసీఆర్‌ ఇకనైనా హుందాగా వ్యవహరించి ముందుగా వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ స్థాయి, దేశ స్థాయి విషయాలను తర్వాత చర్చిస్తే బాగుంటుందని, ఇలాంటి కల్లిబొల్లి మాటలను మానుకోవాలని ఘాటుగా విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి