తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు(కేసీఆర్) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో స్వమిత్వ పథకాన్ని అమలు చేయాలని ఆ లేఖలో కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే పథకంను స్వమిత్వ పథకం అని అంటారు. ఈ స్వమిత్వ పథకంను రాష్ట్రంలో అమలు చేయటం గురించి లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు వారి గృహాలకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించి, తద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 ఏప్రిల్, 2021 న “సర్వే ఆఫ్ విలేజెస్ ఆబాది & మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వమిత్వ)” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించటానికి ముందే హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టు క్రింద విజయవంతంగా అమలుచేయటం జరిగింది.
ఈ పథకం క్రింద పొందిన ఆస్తి ధృవీకరణ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి ఋణాలు తీసుకోవటానికి, ఇతర ప్రయోజనాలను పొందటానికి వీలుగా ఉంటుంది. ఈ పథకం ద్వారా రూపొందించిన ల్యాండ్ రికార్డులు గ్రామీణాభివృద్ధి ప్రణాళికకు కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా, సాధారణంగా వచ్చే ఆస్తి వివాదాలు కూడా ఈ ల్యాండ్ రికార్డుల మూలంగా తగ్గిపోయే అవకాశం ఉంది. మార్చి 2025 నాటికి దేశంలోని అన్ని గ్రామాలలో కూడా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది.
ఈ పథకానికి సంబంధించి కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వశాఖ జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా ఉండగా, ఆయా రాష్ట్రాల పంచాయతీ రాజ్ శాఖ సహకారంతో రెవెన్యూ శాఖ రాష్ట్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పథకం అమలుకు సంబంధించిన సాంకేతిక సహకారాన్ని సర్వే ఆఫ్ ఇండియా అందిస్తోంది. డ్రోన్ టెక్నాలజీని వాడటం ద్వారా ఆయా ఆస్తులకు సంబంధించిన సర్వేను నిర్వహించి, నిర్ధిష్టమైన మ్యాపులను రూపొందించటం జరుగుతుంది.
ఈ పథకం క్రింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న 2,28,659 గ్రామాలలో డ్రోన్ సర్వేను పూర్తి చేయగా.. 1,93,579 గ్రామాలకు సంబంధించిన మ్యాపులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించటం జరిగింది. ఇందులో 6.54 కోట్లకు పైగా ల్యాండ్ రికార్డులను డిజిటైజ్ చేయడం జరిగింది. 95,339 గ్రామాలలో ఆయా మ్యాపులకు సంబంధించిన విచారణను పూర్తి చేసి, 62,133 గ్రామాలకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలను సిద్ధంచేసి, 54,753 గ్రామాలలో ఆయా ఆస్తి ధృవీకరణ పత్రాలకు సంబంధించిన పంపిణీ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా ఎంతో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా 19 ఏప్రిల్, 2022 న కేంద్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఒప్పందం అనంతరం పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేసుకున్న రాష్ట్రంలోని 5 గ్రామాలలో డ్రోన్ సర్వేను విజయవంతంగా నిర్వహించి, ఆస్తులకు సంబంధించిన మ్యాపులను రూపొందించటం జరిగింది. ప్రస్తుతం ఈ మ్యాపులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను రూపొందించి, హక్కుదారులకు పంపిణీ చేయవలసిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి మిగిలి ఉందని లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ 29 జూలై, 2022 న కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖను వ్రాయడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయినప్పటికీ ఈ విషయంలో ఇంతవరకూ ఎటువంటి ముందడుగు పడకపోవడం దురదృష్టకరం అని లేఖలో పేర్కొన్నారు.
ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసినట్లయితే.. రాష్ట్రంలోని గ్రామీణప్రాంత ప్రజలకు తమ ఇళ్లకు సంబంధించిన ఆస్తి ధృవీకరణ పత్రాలు లభించి, వారికి ఒక ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించినట్లవుతుంది. అంతేకాకుండా, ఈ పథకం అమలులో వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని వ్యవసాయ భూముల సర్వేకు కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా, ల్యాండ్ రికార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ధరణి పోర్టల్ నందు ఎదురవుతున్న సమస్యల మూలంగా లక్షలాదిమంది తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుండి కూడా బయటపడవచ్చు.
కావున, ఈ విషయంలో మీరు ప్రత్యేకమైన చొరవ చూపించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వమిత్వ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోగలరని మనవి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం