ప్రాణం ఇస్తానన్నాడు… ప్రాణం తీసేసుకున్నాడు.. మిడ్ మానేరులో గుండెల్ని పిండేసే విషాదం!

వేసవి కాలం వస్తే చాలు.. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం, కాసేపు సరదాగా గడిపేందుకు యువత చెరువులు, నదులు, జలాశయాల వైపు అడుగులు వేస్తుంటారు. కానీ, ఆ సరదా ఒక్కోసారి జీవితాంతం తీరని శోకాన్ని మిగులుస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక ఘోర దుర్ఘటన నిరూపించింది. స్నేహితులతో కలిసి నవ్వుతూ వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ప్రాణం ఇస్తానన్నాడు... ప్రాణం తీసేసుకున్నాడు.. మిడ్ మానేరులో గుండెల్ని పిండేసే విషాదం!
Mid Manair Reservoir (file)

Edited By:

Updated on: May 22, 2026 | 1:49 PM

వేసవి కాలం వస్తే చాలు.. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం, కాసేపు సరదాగా గడిపేందుకు యువత చెరువులు, నదులు, జలాశయాల వైపు అడుగులు వేస్తుంటారు. కానీ, ఆ సరదా ఒక్కోసారి జీవితాంతం తీరని శోకాన్ని మిగులుస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఒక ఘోర దుర్ఘటన నిరూపించింది. స్నేహితులతో కలిసి నవ్వుతూ వెళ్లిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోగా, అందులో ఒకరు తన స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో అమరుడవ్వడం మొత్తం జిల్లాను కన్నీటి సముద్రంలో ముంచెత్తింది.

సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన హరిచరణ్, వేములవాడ ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన మణికంఠతో పాటు వారి స్నేహితులు అభి, సాయి చరణ్, అభిలాష్ కలిసి ఐదుగురు యువకులు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, కాసేపు ఈత కొట్టి సేదతీరుదామని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రామప్పగుట్ట ఆలయ శివారులో ఉన్న మిడ్ మానేరు జలాశయానికి వెళ్లారు. అక్కడకు చేరుకున్న యువకులు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ నీటిలోకి దిగారు. కానీ, ఆ సంతోషం కొద్దిసేపట్లోనే ఒక పెద్ద విషాదంగా మారుతుందని ఆ ఐదుగురిలో ఎవ్వరూ ఊహించలేదు.

జలాశయంలో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదం ఒక్కసారిగా ముంచుకొచ్చింది. మణికంఠకు ఈత సరిగా రాకపోవడంతో, అతడు నీటి లోతును అంచనా వేయలేక ప్రమాదకరమైన లోతైన ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా నీటిలో మునిగిపోతూ, ప్రాణభయంతో కాపాడాలంటూ కేకలు వేశాడు. ఆ గొంతు విన్న హరిచరణ్ ఏమాత్రం ఆలోచించకుండా, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్నేహితుడిని రక్షించేందుకు నీటిలోకి దూకాడు.

అయితే, తీవ్ర భయాందోళనలో ఉన్న మణికంఠ.. హరిచరణ్‌ను గట్టిగా పట్టుకున్నాడు. నీటి సుడిగుండంలో ఇద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టలేక, ఊపిరాడక కళ్లముందే నీట మునిగిపోయారు. గట్టుపై ఉన్న మిగతా ముగ్గురు స్నేహితులు ఏం చేయాలో తోచక, సహాయం కోసం అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలిచేందుకు పరుగులు తీశారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. తన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉన్నా, కళ్లముందు మునిగిపోతున్న స్నేహితుడిని వదిలేయలేక, చివరి శ్వాస వరకు కాపాడటానికి ప్రయత్నించిన హరిచరణ్ ధైర్యం, త్యాగం స్థానికులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన అనంతరం హరిచరణ్, మణికంఠల మృతదేహాలను నీటి నుంచి బయటకు తీశారు. సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న తమ బిడ్డలు శవాలుగా మారడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్నేహితుడిని కాపాడబోయి మా బిడ్డ ప్రాణాలు కోల్పోయాడంటూ హరిచరణ్ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది.

ఈ ప్రమాదకర ఘటన నేపథ్యంలో పోలీసులు యువతకు, తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. వేసవి కాలంలో చెరువులు, జలాశయాలు, కాలువల వద్దకు వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఈత రానివారు, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి అస్సలు వెళ్లకూడదని, సరదా కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us