కన్నతల్లిదండ్రులే కాలసర్పమై కాటేస్తే! ఆ బిడ్డలకు బతుకేదీ..?
వైద్యశాస్త్రంలో కొన్ని పదాలున్నాయి. సైకోసిస్, స్కీజోఫ్రేనియా.. అందరికీ సుపరిచితమైన డిప్రెషన్.. ఇవన్నీ మానసిక ఆరోగ్య సమస్యలు. ఇవి ఉన్న వాళ్లలో కొందరు.. బయటకు చాలా బాగా కనిపిస్తారు, బాగా పలకరిస్తారు కూడా. కాని, వారిలో దాగున్న సమస్యలేంటో కొన్ని సార్లు వాళ్లకే కనిపించవు.

అతడొక కిడ్నాపర్. గుండెలపైకి ఎత్తుకున్న ఆ పిల్లాడిన్నే.. ఆ కిడ్నాపర్ ఎత్తుకెళ్లింది. ఎందుకు ఎత్తుకెళ్లాడో తెలీదు గానీ.. చాలా గారాబంగా పెంచుకున్నట్టున్నాడు. పోలీసులు దర్యాప్తు చేసి, కిడ్నాపర్ అడ్రస్ కనిపెట్టి, పిల్లాడిని ఆ తల్లిదండ్రులకు ఇవ్వబోతోంటే.. ఎలా ఏడ్చారో తెలుసా..! పిల్లాడైతే కిడ్నాపర్‌ను వదిలిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అపహరించిన వ్యక్తి కూడా వదల్లేక వదల్లేక ఇచ్చేశాడు. కంటి నుంచి ధారలా కారుతున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. అతనేం కనలేదు, పెంచి పెద్ద చేయలేదు ఆ పిల్లాడిని. అయినా ఎంత ప్రేమో చూడండి. మరి.. ఏం పొయ్యేకాలం వచ్చింది కొందరు తల్లులకు, మరికొందరు తండ్రులకు..! నవమాసాలు మోసారుగా. గుండెలపైకి ఎక్కించుకుని ఆడించారుగా.. ముద్దుముద్దు మాటలకు మురిసిపోయారుగా.. చిట్టితల్లి, చిట్టితండ్రి అని అల్లారు ముద్దుగా పిలుచుకున్నారుగా..! అయినా సరే.. చంపడానికి మనసొచ్చిందా..! అమ్మో.. మనసు అనే పదం వాడకూడదేమో..! వాళ్లకసలు మనసుంటే.. వారిలో కొంచెమైనా మానవత్వం ఉంటే.. మనిషిగా పుట్టాం అనే ఇంగిత జ్ఞానం ఉండుండుంటే ఇలా ప్రవర్తించేవాళ్లా? ‘4 నెలల కొడుకును కొట్టి చంపిన తల్లి’ అట..! ‘అన్నంలో విషం పెట్టి ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి’. ‘నలుగురు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య’. ‘పాలలో పురుగుల మందు కలిపి బిడ్డల్ని చంపిన తల్లిదండ్రులు’. ‘ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రుల ఆత్మహత్య’. ‘పిల్లల్ని బకెట్‌లో ముంచి చంపిన నాన్న’. ‘కూతురిని తలపై కొట్టి చంపిన పేరెంట్స్’. ఇలాంటి వార్తలు ఇక లేక కాదు.. చదవలేక ఆపేస్తున్న హెడ్‌లైన్స్...