సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సవరించింది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయమున్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎక్స్ ప్రెస్, డీలక్స్ సర్వీసుల్లో 350 కిలో మీటర్ల లోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే రూ.30 వసూలు చేయనుంది.
“టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు మంచి స్పందన ఉంది. ప్రతి రోజు సగటున 15 వేల వరకు తమ టికెట్లను ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తగ్గించడం జరిగింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరూ ఉపయోగించుకుని.. సంస్థను ఆదరించాలి.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
మరోవైపు రక్తదానంపై కూడా TSRTC అవగాహన కల్పిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ‘ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే ట్యాగ్ లైన్‌లో ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. మానవత్వంతో స్పందించి బ్లడ్ డోనేట్ చేయడానికి ముందుకు రావాలని సంస్థ తరపున కోరుతున్నారు. డిపో పరిధిలోని ప్రతి విద్యాసంస్థ నుంచి 20 నుంచి 30 మంది స్టూడెంట్స్ పాల్గొని రక్తదాన శిబిరాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..