మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే మీ ఇంటికే ‘బంగారం’

Medaram Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారక్క మహా జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు నడిపే ప్రత్యేక బస్సుల ఛార్జీలను కూడా ఖరారు చేసింది. హైదరాబాద్, వరంగల్ తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు నడిపే ప్రత్యేక బస్సు ఛార్జీలను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే మీ ఇంటికే ‘బంగారం’
Medaram Rtc Buses

Updated on: Jan 18, 2026 | 1:22 PM

Medaram Maha Jatara: మేడారం సమ్మక్క-సారక్క మహా జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు నడిపే ప్రత్యేక బస్సుల ఛార్జీలను కూడా ఖరారు చేసింది. హైదరాబాద్, వరంగల్ తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు నడిపే ప్రత్యేక బస్సు ఛార్జీలను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వరంగల్, హనుమకొండ ప్రాంతాల నుంచి వెళ్లే బస్సుల ఆధారంగా రూ. 250 నుంచి రూ. 500 టికెట్ ఛార్జీలు ఉండగా.. హైదరాబాద్ నుంచి రూ. 600 నుంచి రూ. 1100 వరకు టికెట్ రేట్లను నిర్ణయించింది. అంతేగాక, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్ నుంచి మేడారంకు ఎక్స్ ప్రెస్ బస్ ఛార్జీ రూ. 600, సెమీ డిలక్స్ రూ. 650, డీలక్స్ 680, సూపర్ లగ్జరీ 770, రాజధాని 960, గరుడ ప్లస్ ఛార్జీ రూ. 1110గా నిర్ణయించింది.

హనుమకొండ నుంచి ఎక్స్‌ప్రెస్ రూ. 250, సెమీ డీలక్స్ రూ. 270, డీలక్స్ రూ. 300, సూపర్ లగ్జరీ రూ. 350, రాజధాని రూ. 450, గరుడ ప్లస్ ర. 500, వరంగల్ నుంచి ఎక్స్‌ప్రెస్ రూ. 250, సెమీ డీలక్స్ రూ. 270, రాజధాని రూ. 450, గరుడ ప్లస్ రూ. 500 గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు జనగామ నుంచి రూ. 400, మహబూబాబాద్ రూ. 360, భూపాలపల్లి రూ. 230, కరీంనగర్ రూ. 390, ఖమ్మం 480, గోదావరిఖని రూ. 400, కొత్తగూడెం నుంచి రూ. 350గా ఖరారు చేశారు.

ఇంటి వద్దకే మేడారం ‘బంగారం’ ప్రసాదం

మేడారం జాతర సందర్భంగా అమ్మవార్ల బంగారం ప్రసాదం(బెల్లం)ను భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను, టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. కేవలం రూ. 299 చెల్లించడం ద్వారా అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తులు తమ ఇంటి వద్దనే పొందవచ్చు.

భక్తులు tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌ ద్వారాలేదా సమీపంలోని టీజీఎస్‌ఆర్‌టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో ప్రసాదాన్నిబుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం, టీజీఎస్‌ఆర్‌టీసీ కాల్ సెంటర్‌ను 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు.

మేడారం మహా జాతర

ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.

ఆ తర్వాత జనవరి 30న వన దేవతలకు భక్తులు తమ తమ ముక్కులు చెల్లించుకుంటారు. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు తెలిపారు.