
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలోనే విలీనం చేయడానికి సంబంధించిన బిల్లుపై స్పందించారు గవర్నర్ తమిళిసై. దాంతోపాటు మరో 3 బిల్లులపై కొన్ని వివరణలు కోరారు. టీఎస్‌ఆర్టీసీ బిల్లులోని నిబంధనలను పరిశీలించి, నిర్దిష్ట వివరణలు, అస్పష్టతలపై ప్రభుత్వం ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని అంశాలపై స్పష్టత కోరినట్లు తెలిపారు గవర్నర్. బిల్లుపై క్లారిఫికేషన్ పంపిస్తే వెంటనే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వానికి సూచించారు గవర్నర్ తమిళిసై. ఈ మేరకు తన వద్దకు చేరిన బిల్లులను తిరిగి పంపించారు. అయితే, గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులను తెలంగాణ శాసనసభ మరోసారి ఆమోదించింది. మున్సిపల్ బిల్లును మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టగా.. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యూలేట్ ఆఫ్ ఏజ్ సవరణ బిల్లు, స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీల ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ రెగ్యూలేషన్ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులను ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. ఈ నాలుగు బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపారు.
ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సంస్థను ఆర్టీసీలో విలీనం చేయడం వలన అటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు.. ఉద్యోగులకూ మేలు జరుగుతుందని భావించింది ప్రభుత్వం. ఇక గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అయితే, ఇది ద్రవ్య పరమైన బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి తప్పనిసరి. అందుకే.. గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం ఆర్టీసీ బిల్లుతో పాటు మరో 3 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. అయితే, ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపలేదు. కొన్ని వివరణలు కావాలంటూ ఆ బిల్లులను తిప్పి పంపారు.
తెలంగాణ గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలుపకుండా తిప్పి పంపిన గవర్నర్ చర్యను నిరసిస్తూ.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు. శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు బస్సులు బంద్ ప్రకటించారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి. ఇక ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. పీవీ మార్గ్ నుంచి రాజ్‌భవన్ బయల్దేరి వెళ్లనున్నారు కార్మికులు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన బిల్లుకు వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. కాగా, ఆర్టీసీ ముట్టడి పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..