
టీఆర్ఎస్ పార్టీ ఆరోగ్యకర రాజకీయానికి తెరతీసింది. కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల స్థితిగతుల్ని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్కకు స్వయంగా చూపించింది. హైదరాబాద్లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను చూపించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి మరీ వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా వారి వెంట ఇళ్ల పరిశీలనకు వెళ్లారు. జియాగూడ, గోడే ఖబర్, కట్టెలమండి, అంబేద్కర్ నగర్, మారేడుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను వీళ్లంతా పరిశీలించారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణం సాగుతుందని.. రాజకీయ ప్రమేయం లేకుండా ఇళ్ల పంపిణీ ప్రక్రియ జరుగుతుందని మంత్రి తలసాని ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత భట్టి ఓపెన్ గా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేకపోతున్నారని తలసాని ఈ సందర్భంగా అన్నారు. కాగా, హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల లెక్కలపై కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య నిన్న అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కట్టిన ఇళ్లను చూపెట్టాలని భట్టి విసిరిన సవాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించి తర్వాతిరోజే భట్టి అనుమానాల్ని తీర్చే ప్రయత్నం చేశారు.