World Economic Fourm: వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి మరోసారి మంత్రి కే. తారకరామారావుకి ఆహ్వానం లభించింది. వచ్చే సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు దావోస్ లో ఈ సమావేశం జరగనుంది. ఆహ్వానం పంపిన సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రాండె, మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఒక అగ్రగణ్య టెక్నాలజీ పవర్ హౌస్ రాష్ట్రంగా మారిందని, ముఖ్యంగా covid-19 సంక్షోభం తర్వాత వినూత్నమైన టెక్నాలజీలు, విధానాలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం చేపట్టిన కార్యక్రమలపైన మంత్రి కే తారకరామారావు తన అనుభవాలను పంచుకోవాలి అని కోరారు.
దీంతో పాటు ఎమర్జింగ్ టెక్నాలజీలను సామాన్య మానవుల ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపైన కూడా తన అభిప్రాయాలను తెలపాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు కేటీఆర్ ని కోరారు. ప్రపంచంలోని రాజకీయ, వ్యాపార, పౌర సమాజ నాయకులు ఉమ్మడిగా ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడం పైన కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రయత్నిద్దామని మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలిపింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి అందిన ఆహ్వానం తెలంగాణ వినూత్న విధానాలకు ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని మంత్రి కే తారకరామారావు ఈ సందర్బంగా అన్నారు. ఈ ఆహ్వానంపైన హర్షం వ్యక్తం చేసిన కే తారకరామారావు, తెలంగాణ రాష్ట్రం ఐటి, ఇన్నోవేషన్ మరియు ఇండస్ట్రీ రంగాల్లో లో చేపట్టిన కార్యక్రమాలకు దక్కిన గుర్తింపు ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం అన్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతామని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తనకు ఆహ్వానం పంపిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు మంత్రి కే. తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.
Read also: Kannababu: ఏ ముహూర్తాన అన్నారో.. అచ్చెన్నాయుడి ఆ మాటలే నిజమవుతున్నాయి: ఏపీ మంత్రి కన్నబాబు