కొద్దిరోజులుగా ఆకాశాన్నంటుతున్న ఉల్లిధర నుంచి.. తెలంగాణ ప్రజలకు కాస్త ఊరట లభించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ధర రూ. 100 మార్క్‌ను చేరుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సత్వర ఉపశమనం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి దిగుమతి అవుతోంది. అంతేకాదు.. సామాన్యప్రజానీకానికి ఉల్లి ఘాటు తగలకుండా.. ఉపశమన చర్యలకింద సబ్సీడీతో ఉల్లి సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లి కౌంటర్లు ఏర్పాటు చేసి.. కిలో ఉల్లి ధర.. రూ.40కి అందించేవిధంగా చర్యలు చేపట్టింది.
ఇందుకోసం.. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి.. నగరానికి పెద్దమొత్తంలో ఉల్లి దిగుమతికానుంది. దాదాపు 5 వందల మెట్రిక్ టన్నుల ఉల్లిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తొలుత మలక్‌పేట మార్కెట్‌కు చేరుకున్న తర్వాత.. అక్కడి నుంచి ఒకట్రెండు రోజుల్లో ఇతర మార్కెట్లకు చేరవేసి.. ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.
అంతేకాదు.. ఈజిప్టు నుంచి కూడా 500 మెట్రిక్ టన్నుల ఉల్లిని తెప్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే దిగుమతి చేసుకునే ఉల్లిపై.. కేంద్రం దిగుమతి పన్ను విధించకుండా మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉల్లి నగరానికి చేరుకోనుంది. దీనిని నగరంలోని పలు మార్కెట్ల ద్వారా.. కిలో రూ.50 నుంచి రూ.60 లోపు విక్రయించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.