
కుటుంబంలో ఒక్కరికి తీవ్రమైన అనారోగ్యం వస్తే ఆ కుటుంబం ఆర్థికంగా దశాబ్దాల కాలం వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆస్తులు అమ్ముకోవడం, అప్పులపాలు కావడం పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు సర్వసాధారణంగా మారింది. అలాంటి సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం నిరుపేదలకు కొండంత అండగా, జీవనదాయినిగా నిలుస్తోంది. గతంలో కుటుంబానికి చికిత్స పరిమితి రూ. 5 లక్షల వరకు మాత్రమే ఉండేది. దీనివల్ల పెద్ద ఆపరేషన్లకు రోగులు సొంత డబ్బులు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచడంతో బాధితులకు ఆర్థిక భయం తొలగిపోయింది. గుండె మార్పిడి, క్యాన్సర్ రేడియేషన్, కిడ్నీ మార్పిడి వంటి ప్రధాన శస్త్రచికిత్సలతో సహా దాదాపు 1,835 రకాల చికిత్సలు ఉచిత పరిధిలోకి వచ్చాయి.
కార్పొరేట్ స్థాయిలో నగదు రహిత వైద్యం
ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న రోగి ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సేవల నిరంతరాయానికి, నెట్‌వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపులకు వైద్యారోగ్య శాఖ దాదాపు ₹400 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.
నెట్‌వర్క్ ఆసుపత్రుల వేగవంతమైన సేవలు
ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వందలాది ప్రైవేట్, కార్పొరేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కౌంటర్లు నిరంతరం సేవలందిస్తున్నాయి. నిధుల విడుదలను క్రమబద్ధీకరించడంతో ప్రైవేట్ ఆసుపత్రులు సైతం ఉత్సాహంగా బాధితులకు తక్షణ వైద్యం అందిస్తున్నాయి. పేదరికంతో వైద్యాన్ని వాయిదా వేసుకునే రోజులకు చరమగీతం పాడుతూ, ఆరోగ్య తెలంగాణ దిశగా ఈ పథకం బలమైన పునాదిగా మారుతోంది.
మాజీ మంత్రి వ్యాఖ్యలపై సీఈవో స్పందన
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలపై ఆరోగ్యశ్రీ సీఈవో స్పందించారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. గతంలో కంటే ఇప్పుడు మరిన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.