AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విద్యార్థిని హారిక ఎంబీబీఎస్‌ ఖర్చు భరిస్తానంటూ హామీ

తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ హారికని చదివించింది. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతి కటాక్షం ఉన్న హారిక మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 942 మార్కులు సాధించింది.

MLC Kavitha: మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. విద్యార్థిని హారిక ఎంబీబీఎస్‌ ఖర్చు భరిస్తానంటూ హామీ
Mlc Kavitha
Basha Shek
|

Updated on: Nov 09, 2022 | 2:58 PM

Share

ఎమ్మెల్సీ కవిత మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. యూట్యూబ్‌ ద్వారా క్లాసులు విని నీట్‌లో ఎంబీబీఎస్‌ ర్యాంకు సాధించిన విద్యార్థిని హారికకు ఆమె అండగా నిలిచారు. ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న చదువుల తల్లి ఎంబీబీఎస్‌ ఖర్చులను తాను భరిస్తానంటూ ఎమ్మెల్సీ ముందుకొచ్చారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న ఆమె మొదటి ఏడాదికి సంబంధించి కాలేజీ ఫీజుని చెక్కు రూపంలో హారిక కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేశారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ జిల్లా నాందేవ్‌ గూడకు చెందిన సతీష్‌ కుమార్‌, అనురాధల కుమార్తె హారిక. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి బీడీ కార్మికురాలిగా పని చేస్తూ హారికని చదివించింది. లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతి కటాక్షం ఉన్న హారిక మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్‌లో 942 మార్కులు సాధించింది. ఎంబీబీఎస్‌ చేసి డాక్టర్‌ అవ్వాలన్న కృతనిశ్చయంతో ఇంట్లోనే యూట్యూబ్‌లో వీడియో క్లాసులు వింటూ నీట్‌కు సిద్ధమైంది. తన కష్టానికి గుర్తింపుగా నీట్‌లో జాతీయ స్థాయిలో 40వేల ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 700వ ర్యాంకు సాధించింది. హైదరాబాద్‌లోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చినప్పటికీ.. ఆర్థిక సమస్యల దృష్ట్యా ఇంట్లోనే ఉండిపోయింది.

కాగా సోషల్‌ మీడియా, వార్త కథనాల ద్వారా హారిక విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిజామాబాద్ పర్యటనలో హారికను స్వయంగా కలిసి ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానని ఎమ్మెల్సీ భరోసానిచ్చారు. ‘ చదువుకోవాలన్న ఆకాంక్ష, తపన ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదు. చదువుకు పేదరికం అడ్డుకాదని హారిక నిరూపించింది. తనకున్న పరిమిత వనరులన్నీ సద్వినియోగం చేసుకొని ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడం సంతోషకరం. విద్యార్థులంతా హారికను స్ఫూర్తిగా తీసుకోవాలి. హారిక ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిగా సమాజానికి సేవలు అందించాలి’ అని కవిత ఆకాంక్షించారు. కవిత అందించిన ఆర్థిక సాయానికి గానూ హారిక తో పాటు ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెక్కు అందుకుంటున్న సమయంలో అందరూ ఎమోషనల్‌ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..