దేశరాజధాని ఢిల్లీ శివారులో రైతుల ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించిన అన్నదాతలు తమ ఉద్యమాన్ని ఆపడం లేదు. రేపు హైవేల దగ్గర ఆందోళన చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో బీజేపీయేతర పార్టీలు కూడా స్వరం పెంచుతున్నాయి. అన్నదాతలకు మద్దతు ప్రకటిస్తున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా అన్నదాతలకు మద్దతు ప్రకటించారు. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు మద్దతు ఇచ్చినట్టు కనిపించిన టిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మళ్లీ రైతు ఉద్యమానికి మద్దతు తెలుపుతుండటం విశేషం. తాజాగా మంత్రి ఈటల కేంద్రంపై స్వరం పెంచారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ముప్పు పొంచి ఉందంటున్నారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో ప్రమాదం పొంచి ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు ఇక్కడి అన్నదాతలు మద్దతిస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకంతోనే తెలంగాణ రైతులు మౌనంగా ఉన్నారన్నారు. కరీంనగర్ జిల్లా మల్యాలలో రైతు వేదిక ప్రారంభ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేశారు. తెలంగాణలో అత్యధిక శాతం రైతులు వడ్లు పండిస్తారని, అయితే కేంద్రం చట్టాల వల్ల రేపు వడ్లు పండిస్తే కొంటారో, కొనరో అని రైతులకు భయం ఉందన్నారు.
రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనే శక్తి ఏ వ్యాపారికి లేదన్నారు. ఐకెపి సెంటర్లలో వడ్లు కొంటనే మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ రైతులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు మంత్రి. ఎఫ్ సి ఐ 29 రాష్ట్రాలలో ఒక కోటి ఐదు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, అందులో ఒక్క తెలంగాణ మాత్రమే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తుందన్నారు. మనదేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశమని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఈటల రాజేందర్.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయిన చలి తీవ్రత, ఏజెన్సీ ప్రాంతాల్లో చలితో గజగజ వణికిపోతున్నారు గిరిజనం