Etela Rajender Land Grab Allegations: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ భారీ భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట అలాగే, హకీంపేట్ గ్రామాలకు చెందిన కొందరు బలహీన వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. అనంతరం ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మరింది. అధికార పార్టీ కావాలనే బీసీ నాయకుడిని టార్గెట్‌గా చేసుకుందంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాగా గతకొంతకాలం క్రితం ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం బీసీ నేతను బలిచేస్తున్నారన్న విపక్షాల కామెంట్లపై టీఆర్ఎస్ నేత వేణుగోపాల చారి స్పందించారు.
ఈటెల రాజేందర్ విషయంలో విపక్షాలు బీసీ అని లేవనెత్తుతున్నారని.. ఇది తగదంటూ సూచించారు. టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందంటూ వెల్లడించారు. మంత్రి వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదులు అందిన నేపధ్యంలోనే.. ఆయన విచారణకు ఆదేశించారని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని.. విపక్షాలు రాజకీయాలు చేయొద్దని పేర్కొన్నారు. విచారణలో ఎవరి తప్పు అయితే వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటూ వెల్లడించారు. కాగా.. ఈటెల రాజేందర్ కూడా విచారణకు సిద్ధం అన్నారని గుర్తుచేశారు. గత ప్రభుత్వల హయాంలల్లో కూడా మంత్రుల మీద ఆరోపణలు వస్తే విచారణ నిర్వహించి చర్యలు తీసుకున్నారన్నారు. ఇప్పుడు కూడా విచారణ అయ్యాకే చర్యలు ఉంటాయంటూ పేర్కొన్నారు.
Also Read: