
సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దూరాజ్ పల్లి తెల్లబండ కాలనీకి చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటిలు కూలీలుగా పనిచేస్తున్నారు. సూర్యాపేటకు చెందిన వ్యాపారి నిమ్మనగోటి వెంకటేశ్వర్లు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని హోటల్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ హోటల్ నిర్మాణం మట్టి పనులను గణేష్, చంటీలిద్దరూలు చేశారు. వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద చాలా డబ్బు ఉందని గ్రహించిన ఈ కేటుగాళ్లు.. ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ వేసి.. ఫ్రెండ్స్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఇతర ప్రాంతాల్లో తాము మట్టి పని చేస్తున్న క్రమంలో లంకె బిందెలు దొరికాయని వాటిలో కేజీల కొద్దీ పురాతన బంగారు నాణాలు ఉన్నాయని చెప్పారు. లంకె బిందెలకు సంబంధించి ఫేక్ వీడియోలు చూపించి వ్యాపారి వెంకటేశ్వర్లను కేటుగాళ్లు నమ్మించారు.
లంకె బిందెలు దొరికితే అదృష్టం వరిస్తుందని.. ధనవంతులవుతారని ఒక నమ్మకం. ఈ నమ్మకంతో లంకె బిందెల బంగారు నాణాలను కొనుగోలు చేయాలని వెంకటేశ్వర్లు భావించాడు. ఈ లంకె బిందెల్లోని బంగారు నాణాలను అతితక్కువ ధరకు అమ్ముతామని చెప్పి విడతల వారీగా 20 లక్షల రూపాయలను కంత్రిగాళ్లు వసూలు చేశారు. లంకె బిందెలు తీసుకురావడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ కాలయాపన చేస్తూ కట్టు కథలు చెప్పారు. డబ్బులు తీసుకెళ్ళి బంగారం ఇవ్వకపోవడంతో వ్యాపారి వెంకటేశ్వర్లు వారిపై సీరియస్ అయ్యాడు. ఒంటికి కోడి రక్తం పూసుకుని గుర్తు తెలియని వ్యక్తులు తమను కొట్టి డబ్బులెత్తుకెళ్లారని ఈ కేటుగాళ్లు.. వ్యాపారి వెంకటేశ్వర్లుకు చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వర్లు చివ్వేంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా గ్యాంగ్ లోని నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి 13.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి డబ్బులు కోల్పోవొద్దని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.