పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి

పెళ్లయి కేవలం 15 రోజులు.. భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఆ యువకుడి జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువ సివిల్ ఇంజనీర్ మృతి చెందడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది..

పెళ్లైన 15 రోజులకే విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
Hyderabad Youth Death in USA

Edited By:

Updated on: Sep 16, 2026 | 12:06 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్‌నగర్‌కు చెందిన మహమ్మద్ జాబీర్ హుస్సేన్ సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గత ఐదేళ్లుగా అమెరికాలోని టెక్సాస్‌లో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే జాబీర్ వివాహం జరిగింది. అమెరికన్ సిటిజన్‌షిప్ ఉన్న యువతితో సుమారు 15 రోజుల క్రితం ఆయన వివాహం జరిగినట్లు సమాచారం. పెళ్లి అనంతరం భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు జాబీర్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భార్య ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెతో కలిసి ఉండేందుకు టెక్సాస్‌లో జాబీర్ ఇంటి కోసం కూడా వెతుకుతున్నట్లు తెలిపారు.

అసలేం జరిగిందంటే?

కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో ముందుకు సాగుతున్న సమయంలోనే జాబీర్ అనూహ్యంగా మృతి చెందారు. ఆయన తాను ఉంటున్న గదిలోనే మృతి చెందినట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జాబీర్‌కు గుండెపోటు వచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తోందని స్నేహితులు చెప్పినట్లు సమాచారం. అయితే ఆయన మృతికి గుండెపోటే కారణమా? మరేదైనా కారణం ఉందా? అనే విషయం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. స్నేహితులు గది తలుపు తెరిచి చూసే సమయానికి జాబీర్ నేలపై మృతదేహంగా కనిపించినట్లు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయనకు వెంటనే వైద్య సహాయం అందిందా లేదా అనే వివరాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. జాబీర్ మృతికి అసలు కారణం పోస్టుమార్టం, వైద్య నివేదికలు వచ్చిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

కొత్త జీవితంపై ఆశలు.. ఇంతలోనే విషాదం

పెళ్లయి 15 రోజులు కూడా పూర్తికాకముందే జాబీర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుమారుడి పెళ్లి వేడుకల జ్ఞాపకాలు ఇంకా కళ్లముందే ఉండగానే అతడి మరణవార్త వినాల్సి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భార్యతో కలిసి కొత్త ఇంట్లో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయంలో జాబీర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది. తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడం కంటే ముందుగా అమెరికాకు వెళ్లి చివరిసారిగా ఆయనను చూసుకోవాలని జాబీర్ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. జాబీర్‌కు చివరి చూపు చూసి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించేందుకు తమకు, తమ కుమార్తెకు అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా సదుపాయం కల్పించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఈ విషాద సమయంలో తమకు అవసరమైన సహాయం అందించి, చివరిసారిగా కుమారుడిని చూసుకునే అవకాశం కల్పించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్రానికి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లేఖ

జాబీర్ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. జాబీర్ తల్లిదండ్రులు, చెల్లెలు అమెరికాకు వెళ్లి తమ కుటుంబ సభ్యుడికి చివరి చూపు చూసేలా అవసరమైన సహాయం అందించాలని ఆయన కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఒకవైపు కుమారుడి పెళ్లి జ్ఞాపకాలు.. మరోవైపు చివరిసారిగా కుమారుడిని చూసుకునేందుకు ఎదురుచూపులు.. జాబీర్ కుటుంబాన్ని ఈ విషాదం తీవ్రంగా కుదిపేసింది. ఆయన మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక వైద్య నివేదికలు వెలువడిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us