
జగిత్యాల జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన మేడిపల్లి మండలంలోని కొండపూర్ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కొండపూర్ గ్రామానికి చెందిన మనవిత్ (10), మనస్విని (9), షర్వింద్ (7) అనే ముగ్గురు చిన్నారులు బుధవారం (మే 20) మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, సమీపంలోని కోనేరు వద్దకు ఈత కొట్టడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, కోనేరు లోతు ఎక్కువగా ఉండటం, నీటి ప్రవాహం అంచనా వేయలేకపోవడంతో ముగ్గురు చిన్నారులు నీటిలో మునిగిపోయారు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాక, ఊపిరాడక నీటిలోనే ప్రాణాలు విడిచారు.
చిన్నారులు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించగా, కోనేరు వద్ద ఆచూకీ లభ్యమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు స్థానికుల సహాయంతో గాలించి, చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. విగతజీవులుగా పడి ఉన్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. వేసవి సెలవుల దృష్ట్యా పిల్లలు ఈత కోసం చెరువులు, కుంటలు, కోనేర్ల వద్దకు వెళ్లకుండా చూడాలని అధికారులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. ప్రమాదకరమైన నీటి వనరుల వద్ద రక్షణ చర్యలు ఉండాలి. కాగా, పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో కొండపూర్ గ్రామం మూగబోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..