
దొంగతనం చేయడం ఒక ఎత్తైతే.. చేసిన సామాగ్రితో క్షేమంగా పారిపోవడం మరో ఎత్తు. కానీ ఈ దొంగ రూటే వేరు.. కష్టపడి సామాగ్రిని బస్తాలో నింపాడు, తీరా పారిపోయే దారి లేకపోయేసరికి.. అలసిపోయాను కాసేపు పడుకుందాం అనుకున్నాడో ఏమో.. ఏకంగా బాధితుడి ఇంట్లోనే గుర్రుపెట్టి నిద్రపోయాడు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ వింత చోరీ ఉదంతం ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది.”
బీర్కూర్ రెండో వార్డులో నివసించే మాలిపటేల్ అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. నిందితుడు ఇంటి వెనుక వైపు నుంచి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. ప్లాన్ ప్రకారం ఇంట్లో ఉన్న పూజ సామాగ్రి, వంట పాత్రలు, చిల్లర డబ్బులను ఏరి ఒక బస్తాలో నింపుకున్నాడు.
బస్తా నిండా సామాగ్రి అయితే నింపుకున్నాడు కానీ వచ్చిన దారిలో ఆ బరువుతో తిరిగి వెళ్లడం అతనికి కష్టంగా అనిపించింది. బయట నుంచి తలుపుకు తాళం వేసి ఉండటంతో.. ఏదో ఒక ఉపాయం ఆలోచించి వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. లోపల గడియ పెట్టుకుని, దొంగిలించిన మూట పక్కనే పెట్టుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం సమయంలో ఇంటి యజమానులు పూజ గదిలో దీపం వెలిగించేందుకు తాళం తీసి లోపలికి వచ్చారు. లోపల ఎవరో నిద్రపోతుండటం చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గడియ సరిగా పడకపోవడంతో తలుపులు సులభంగానే తెరుచుకున్నాయి.
యజమానులు వెంటనే తేరుకుని చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. స్థానికులు వచ్చి నిద్రమత్తులో ఉన్న దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దొంగతనానికి వెళ్లిన చోట భయం ఉండాలి కానీ, ఇలాంటి నిద్ర భక్తి ఉంటే ఫలితం ఇలాగే ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..