Yadadri: డిప్యూటీ సీఎం భట్టి వివాదంతో కదిలిన యాదగిరి గుట్ట అధికారులు.. పది కొత్త పీటల కొనుగోలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట ఆలయానికి విచ్చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే ఈ సందర్భంగా వేదా ఆశీర్వచనం సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చిన్న పీటపై కూర్చోబెట్టారనే ఘటన విమర్శలకు దారితీసింది. ఈలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదాద్రి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.

Yadadri: డిప్యూటీ సీఎం భట్టి వివాదంతో కదిలిన యాదగిరి గుట్ట అధికారులు.. పది కొత్త పీటల కొనుగోలు
Yadadri Temple

Edited By: Balaraju Goud

Updated on: Mar 14, 2024 | 5:02 PM

మరో తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనారసింహాస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది దేవస్థానం. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి గుట్ట ఆలయానికి విచ్చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే ఈ సందర్భంగా వేదా ఆశీర్వచనం సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చిన్న పీటపై కూర్చోబెట్టారనే ఘటన విమర్శలకు దారితీసింది. ఈలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదాద్రి దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు.

మార్చి 11వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు యాదగిరి గుట్ట ఆలయాన్ని సందర్శించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు వేదాఆశీర్వచనం ఇచ్చే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డిలు ఎత్తుగా ఉన్న పీటలపై కూర్చోవడం, పక్కనే ఎత్తు తక్కువగా ఉన్న పీటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కూర్చున్నారు. యాదాద్రీశుడి సాక్షిగా దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సీఎం రేవంత్ అవమానించారని ప్రతిపక్షాలు విమర్శలు, ట్రోల్స్ చేశాయి. దీంతో ఈ వివాదానికి సంబంధించి తాము ఎవరిని అవమానించలేదని, ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదని ఆలయ అధికారులు సైతం వివరణ ఇచ్చారు. అయినా రాజకీయ విమర్శలు కొనసాగాయి. ఈ విమర్శలకు పుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్వయంగా స్పందించారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని, తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని తేల్చి చెప్పారు. దైవ సన్నిధిలో రాజకీయాలకు తావులేదన్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టారు. యాదాద్రి లక్ష్మీనారసింహా స్వామి దర్శనం కోసం వచ్చే వీఐపీలను పీటలపై కూర్చోబెట్టి వేద ఆశీర్వచనం ఇవ్వడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆలయంలో ఉన్న పీటలన్నింటినీ ఒకే సైజులో సమాంతరంగా లేకపోవడంతో సమస్యలకు దారితీస్తోంది. దీంతో వీఐపీలను ఆశీర్వదించే సమయంలో కూర్చోబెట్టేందుకు 10 కొత్త పీటలను అధికారులు కొనుగోలు చేశారు. ఈ పీటలన్నీ సమాంతరంగా ఒకే ఎత్తులో ఉండేలా చూసి మరీ కొనుగోలు చేశారు. కొత్తవి 10, పాతవి నాలుగు పీటలతో కలిపి ఒకేసారి 14 మంది వీఐపీలకు వేదా ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…