ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన.. తెలంగాణలోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్ వివరాలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. వీరికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక అందజేస్తారని, ఆ నివేదిక ఆధారంగా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
కాగా.. తెలంగాణలో పోటీ చేసే విషయంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన జనసేన పార్టీ నాయకులు హాజరయ్యారు. ఏపీలో జనవాణి కార్యక్రమంతో తన గ్రాఫ్ పెంచుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనన పార్టీని విస్తరింపచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరిలో జరిగిన సమావేశంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాం. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనా..? లేదా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలా..?. కొండగట్టు నుంచి తెలంగాణలో జనసేన రాజకీయం మొదలు పెడతాం. 1947లో కర్నూలులో మనం జెండా ఎగరవేస్తే.. 1948లో తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. రజాకర్ల దాష్టీకంతో తెలంగాణ ప్రజలు నలిగిపోయారు. శ్రీకాంతా చారితో సహా వెయ్యి మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది.
– పవన్ కల్యాణ్, జనసేన అధినేత.. (గతంలో చేసిన వ్యాఖ్యలు)\
మరిన్ని తెలంగాణ వార్తల కోసం