ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతుంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం ఇస్తారు. అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలైయ్యాయి. ఏడుపాయలు ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం..ఈ క్షేత్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగ్‌సాన్‌పల్లి వద్ద అడవిలో ఉంది.
ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట గౌతమి, భరద్వాజ వంటి సప్త రుషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగులతల్లి దేవుళ్లకు వేడుకుంది. నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. యజ్ఞస్థలికి రాగానే భోగవతీ నది ఏడుపాయలుగా చీలి ప్రవహించిందని ఇక్కడి ప్రజలు చెప్పుకుంటారు.
ఏడుగురు రుషులతో యజ్ఞం చేయడం.. గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఏడుపాయల దుర్గామాత అని పేరు వచ్చింది. ఇక్కడ శివరాత్రికి మూడు రోజుల పాటు ఘనంగా జాతర జరుగుతుంది .ఇక దసరా పండుగకు తొమ్మిది రోజుల పాటు ఏడుపాయల వనదుర్గ మాత ఆలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. వనదుర్గ భవాణి మాత దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీశైలపుత్రి (బాలా త్రిపుర సుందరి) అవతారంలో, రెండో రోజు బ్రహాచారిని (గాయత్రీ దేవి)గా, మూడో రోజు చంద్ర గంట (అన్నపూర్ణ) అవతారంలో, నాలుగో రోజు కూష్మాండ (వనదుర్గా), ఐదో రోజు కనక దుర్గాదేవి స్కంద మాత (మహాలక్ష్మి) అవతారంలో, ఆరో రోజు షష్టి కాత్యాయని (సరస్వతిదేవి)గా, ఏడో రోజు కాల రాత్రి (దుర్గాదేవి)గా, ఎనిమిదవ రోజు మహా గౌరీ సిద్ధి రాత్రి (మహిషాసురా మర్ధిని) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఇక తొమ్మిదవ రోజు నవమి, దశమి (విజయదశమి) రాజరాజేశ్వరీదేవీగా ఏడుపాయల వనదుర్గ దేవి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కాగా సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో, అమ్మవారి ఆలయం ముందు నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రస్తుతానికి రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి.