AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VC.Sajjanar: ఇలాంటివి మళ్లీ రిపీట్‌ అయితే.. చట్టపరమైన చర్యలు తప్పవు- TGSRTC ఎండీ సజ్జనార్!

ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ఇటీవల దుండగుల చేతిలో దాడికి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ విద్యాసాగర్‌ను పరామర్శించిన తర్వాత సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

VC.Sajjanar: ఇలాంటివి మళ్లీ రిపీట్‌ అయితే.. చట్టపరమైన చర్యలు తప్పవు- TGSRTC ఎండీ సజ్జనార్!
V.c Sajjanar
Anand T
|

Updated on: Jun 23, 2025 | 8:25 PM

Share

ఇటీవల కాలంలో ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న 300 నంబర్‌ గల ఆర్టీసీ బ‌స్సు కింద బైక్ పడి ఒక గర్భిణి మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో పక్కగా వెళ్తున్న బైక్ అదుపు తప్పి బస్సు వెనుక టైర్ల కింద పడింది. ఈ ప్రమాదంలో గర్భిణి మృతి చెందింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 198 వ‌ద్ద ఈ నెల 19వ తేదీన ఈ ప్రమాదం జరిగింది.

అయితే బస్సు టైర్‌ కింద పడి మహిళ చనిపోవడంతో ఆగ్రహించిన కొందరు ఈ ప్రమాదంలో ఎలాంటి తప్పు లేకున్నా ఆర్టీసీ బస్సు డ్రైవ‌ర్ విద్యా సాగర్ పై విచ‌క్షణ‌ర‌హితంగా దాడి చేశారు. అస‌భ్యప‌ద‌జాలంతో దూషిస్తూ తీవ్రంగా కొట్టారు. దీంతో విద్యాసాగర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అది గమనించిన ఆర్టీసీ కానిస్టేబుళ్లు భాస్కర్, ముఫకర్ అలీలు వెంటనే డ్రైవర్‌ విద్యాసాగర్‌ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి త‌ర‌లించారు.

విషయం తెలుసుకున్న టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండ్లగూడ డిపో డ్రైవర్ విద్యా సాగర్‌ను ప‌రామ‌ర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తమకు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని విద్యాసాగర్‌కు ఎండీ సజ్జనార్‌ భరోసా కల్పించారు.

ఈ ప్రమాదంలో తమ డ్రైవర్‌ది ఎలాంటి తప్పులేదని, ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.ఈ ఘటనపై ఆర్టీసీ అధికారుల పిర్యాదు మేరకు దుండగులపై సైబరాబాద్ కమిషనరేట్ అత్తాపూర్ పోలీసులు బీఎన్ఎస్‌లోని 121(1), 126(2), 115(2) 352, 351(2) ) సెక్షన్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు.

అయితే, ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను సజ్జనార్ తీవ్రంగా ఖండించారు.తమ సిబ్బందిపై దాడుల‌కు పాల్పడితే ఎంతటి వారికైనా చట్టపరమైన చర్యలు తప్పవని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హెచ్చరించారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో బాధ్యులపై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us