Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ ద్వారా ఇంటికే ప్రసాదం.. ఇలా బుక్ చేస్కోండి

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడింది. మరో కొద్ది రోజుల్లో జాతర మొదలు కానుంది. ఈ జాతర కోసం భక్తులందరూ ఎదురుచూస్తున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో..

Medaram Jatara: మేడారం భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్ ద్వారా ఇంటికే ప్రసాదం.. ఇలా బుక్ చేస్కోండి
Medaram Maha Jatara 2026

Updated on: Jan 16, 2026 | 7:26 PM

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన “సమ్మక్క సారలమ్మ జాతర’’కు వచ్చే భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, సమస్యలు ఎదురుకాకుండా అన్నీ సౌకర్యాలు కల్పించేందుకు సర్వం సిద్దం చేస్తోంది. ప్రస్తుతం మేడారం జాతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మేడారం జాతరకు లక్షలాది మంది జనం వస్తారు. దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. దీంతో ఈ జాతరను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు దగ్గరుండి జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పనులను పర్యవేక్షిస్తున్నారు.

భక్తులకు శుభవార్త

ఈ క్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది. అలాగే ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జాతర జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్లకు బంగారం సమర్పించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ప్రకటించారు. మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా తమ ఇంటి వద్దకే చేర్చే సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దేవాదాయ శాఖ సహకారంతో ఈ సేవలను ప్రారంభిస్తుంది. మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో పాటు బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందిస్తారు.

బంగారం ప్రసాదం కోసం ఇలా..

బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు రూ.299 చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. www.tgsrtclogistics.co.in వెబ్ సైట్ లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చుని వెల్లడించారు. మరింత సమాచారం కోసం, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్లు 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చని నాగిరెడ్డి స్పష్టం చేశారు.